తెలంగాణ రాజకీయాలను సాధారణ ప్రజలను కూడా ఓ కుదుపు కుదిపేసిన ‘హైడ్రా’ వ్యవహారం అనేక మలుపులు తిరిగిన విషయం తెలిసిందే. భాగ్య నగరాన్ని సుందర నందనవనంగా మార్చడమే లక్ష్యంగా మూసీ నది ఆక్రమణలు తొలగించేందుకు రేవంత్ రెడ్డి సర్కారు నడుం బిగించింది. ఈ క్రమంలోనే గత ఏడాది జూన్‌లో హైడ్రా వ్యవస్థను ఏర్పాటు చేశారు. అనంతరం.. నెల రోజుల తర్వాత పని ప్రారంభించింది. అనేక మంది ప్రముఖుల ఇళ్లతోపాటు అక్కినేని నాగార్జున కు చెందిన ఎన్ కన్వెన్షన్‌ను కూడా కూల్చి వేశారు. ఆ తర్వాత.. పేదల నివాసాలపైనా దాడులు జరిగాయి.
ఈ క్రమంలోనే అనేక ఆరోపణలు, విమర్శలు వచ్చాయి. అయినప్పటికీ సీఎం రేవంత్ రెడ్డి వెనక్కి తగ్గక పోగా హైడ్రాకు మరిన్ని అధికారాలను కట్టబెట్టారు. దీనికి సంబంధించి ‘జీహెచ్ఎంసీ చట్టం 1955’ను సైతం సవరించారు. చెరువులు, ఆస్తులను కాపాడేందుకు అధికారిని లేదా సంస్థను ఏర్పాటు చేసే అధికారాన్ని ప్రభుత్వానికి కట్టబెడుతూ జీహెచ్ఎంసీ చట్టంలో సెక్షన్ 374 బీని చేర్చారు. ఈ క్రమంలో హైడ్రాకు మరిన్ని విస్తృత అధికారాలు దఖలు పడ్డాయి. ఆ తర్వాత.. కొంత నెమ్మదించిన హైడ్రా.. ఇటీవల మళ్లీ పనులు ప్రారంభించింది. అనధికార కట్టడాల కూల్చివేతలపై కొన్ని లక్ష్మణ రేఖలు నిర్దేశించుకున్నామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు.
ఇక, ఇప్పుడు హైడ్రాకు సంబంధించి ప్రత్యేకంగా ఓ పోలీసు స్టేషన్ ఏర్పాటు చేస్తున్నారు. దీనికి సంబంధించి మంగళవారం పొద్దు పోయాక ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్ నగరంలోని బుద్ధ భవన్‌లోని బీ బ్లాక్‌లో హైడ్రా పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసేలా అవకాశం కల్పిస్తూ ఉత్తర్వుల్లో పేర్కొంది. దీంతో హైడ్రాకు తొలిసారి ఓ పోలీసు స్టేషన్ అందుబాటులోకి రానుంది. ఇది 24 గంటలూ పనిచేయనుంది. ఎవరైనా సరే.. ఆక్రమణలకు సంబంధించిన ఫిర్యాదులను ఈ స్టేషన్‌లో నమోదు చేసుకోవచ్చు. అదేవిధంగా వారికి సంబంధించిన సమస్యలను కూడా వివరిస్తూ.. విన్నవించుకోవచ్చు. ఈ స్టేషన్ కూడా సాధారణ పోలీసు స్టేషన్ లాగానే ఫిర్యాదులు స్వీకరించనుంది. అయితే.. ప్రత్యేక అధికారాల మేరకు పనిచేయనుందని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.