త్వరలో జరగబోయే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే అక్కడి రోడ్లను ప్రియాంకా గాంధీ బుగ్గల్లా నున్నగా చేస్తానంటూ బీజేపీ నేత, మాజీ ఎంపీ రమేష్ బధూరి చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా దుమారం రేపాయి. అయినా సరే అంతటితో ఆగని బధూరి… ఢిల్లీ సీఎం ఆతిషీపై కూడా నోరు పారేసుకున్నారు.
ఈ క్రమంలోనే నాంపల్లిలోని బీజేపీ కార్యాలయం ముట్టడికి కాంగ్రెస్ శ్రేణులు ప్రయత్నించాయి. రాళ్లు, కోడిగుడ్లు, కర్రలతో బీజేపీ ఆఫీసుపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేయడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.
అయితే, కాంగ్రెస్ నాయకులను, కార్యకర్తలను అడ్డుకునేందుకు బీజేపీ నేతలు, కార్యకర్తలు ప్రయత్నించారు. కర్రలతో కాంగ్రెస్ శ్రేణులపై బీజేపీ శ్రేణులు తిరగబడ్డాయి. దీంతో, బీజేపీ కార్యాలయం పరిసర ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.
ఈ దాడిలో పలువురు బీజేపీ కార్యకర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఓ బీజేపీ కార్యకర్త తలకు బలమైన గాయం కావడంతో క్షతగాత్రుడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
అప్పటికే ఇరు వర్గాలను చెదరగొట్టేందుకు పోలీసులు ప్రయత్నించారు. అయితే, పరిస్థితి చేయి దాటడంతో అదనపు బలగాలను రప్పించారు. ప్రస్తుతం నాంపల్లిలో హై టెన్షన్ వాతావరణం ఏర్పడింది. ఆ ప్రాంతానికి ఇటు బీజేపీ, అటు కాంగ్రెస్ శ్రేణులు భారీ సంఖ్యలో చేరుకునేందుకు ప్రయత్నిస్తుండగా…పోలీసులు ఎక్కడికక్కడ వారిని అడ్డుకుంటున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates