ఫార్ములా ఈ కార్ రేస్ నిర్వహణలో ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారంటూ మాజీ మంత్రి కేటీఆర్ పై ఏసీబీ కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆ కేసు కొట్టివేయాలని కోరుతూ తెలంగాణ హైకోర్టులో కేటీఆర్ క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలోనే కేటీఆర్ కు హైకోర్టు షాకిచ్చింది. ఆ క్వాష్ పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది.
దాంతోపాటు కేటీఆర్ అరెస్ట్‌పై ఇప్పటివరకు ఉన్న స్టే కూడా హైకోర్టు ఎత్తివేసింది. అయితే, ఈ తీర్పుపై కేటీఆర్ సుప్రీం కోర్టుకు వెళ్లే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.తాజాగా హైకోర్టు తీర్పుతో ఏసీబీ అధికారులు స్పీడు పెంచనున్నారు. నిన్న విచారణకు వచ్చి వెనుదిరిగిన కేటీఆర్ కు మరోసారి విచారణకు రావాలని ఏసీబీ ఆల్రెడీ నోటీసులు జారీ చేసింది.
తాజాగా క్వాష్ పిటిషన్ కొట్టివేయడంతో మరోసారి కేటీఆర్‌కు నోటీసులు ఇచ్చేందుకు ఏసీబీ అధికారులు రెడీ అవుతున్నారు. మరోవైపు, ఈ రోజు అదే కేసులో ఈడీ విచారణకు కేటీఆర్ హాజరు కావాల్సి ఉంది.
అయితే, కోర్టు తీర్పు నేపథ్యంలో ఈ రోజు హాజరు కాలేనని కేటీఆర్ చెప్పడంతో అందుకు ఈడీ అంగీకరించింది. అయితే, తాజాగా తీర్పు నేపథ్యంలో ఈడీ కూడా త్వరలోనే కేటీఆర్ ను విచారణ జరిపేందుకు రంగం సిద్ధం చేస్తోంది