వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌పై టీడీపీ యువ నాయకుడు, మంత్రి నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్‌ను జనం మరిచిపోతున్నారని వ్యాఖ్యానించారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 80 శాతం మంది ప్రజలు `జగన్ అంటే ఎవరు?` అని ప్రశ్నిస్తున్నారని.. మరో 20 శాతం మంది కూడా త్వరలోనే మరిచిపోయే రోజు రానుందని చెప్పుకొచ్చారు. తాజాగా విశాఖలో పర్యటించిన నారా లోకేష్.. ప్రధాన మంత్రి రాక నేపథ్యంలో ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
“జగన్ పని అయిపోయింది. ఇంకా జగన్ అని అంటారేంటి? ప్రజలు కూడా ఎప్పుడో మరిచిపోయారు. నెల నెలా రూ.4000 చొప్పున పింఛను ఇంటింటికీ చేరుతోంది. ఇంక.. జగన్ ఎందుకబ్బా అని జనాలే అంటున్నారు“ అని నారా లోకేష్ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం వైసీపీ ప్రభావం ఎక్కడా కనిపించడం లేదని చెప్పారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలకు ప్రజల నుంచి మంచి మద్దతు లభిస్తోందన్నారు. త్వరలోనే మరిన్ని కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నట్టు చెప్పారు.
వైసీపీ హయాంలో విశాఖకు ఒక్క ప్రాజెక్టు కూడా రాలేదని.. తాము తీసుకువచ్చిన ప్రాజెక్టులను కూడా.. వైసీపీ తరిమేసిందని నారా లోకేష్ అన్నారు. ఎన్నికలకు ముందు అనేక హామీలు ఇచ్చిన వైసీపీ.. తర్వాత వాటిని తుంగలోకి తొక్కిందని విమర్శించారు. ఉద్యోగులను నిండా ముంచారని.. వారికి సీపీఎస్ ను రద్దు చేస్తానని చెప్పి కూడా.. చేయలేదని దుయ్యబట్టారు. వైసీపీ హయాంలో అన్ని వ్యవస్థలను ధ్వంసం చేశారని.. ప్రస్తుతం వాటినిగాడిలో పెడుతున్నామని చెప్పారు. దీనికి ఇంకా సమయం పట్టేలా ఉందని వ్యాఖ్యానించారు.
కూటమి ప్రభుత్వం చెప్పిన ప్రతి పనినీ చేస్తుందని నారా లోకష్ చెప్పారు. ప్రస్తుతం అభివృద్ధి పై ఎక్కువగా దృష్టి పెట్టామన్న ఆయన.. త్వరలోనే సంపద సృష్టి జరుగుతుందని.. దీంతో అన్ని సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తామని వివరించారు. ప్రధాని మోడీ రాష్ట్రానికి రావడం ద్వారా.. ఆయనతో మన బంధం మరింత పెరుగుతుందని.. సమస్యలు పరిష్కరించేలా ఆయనను ఒప్పిస్తామని నారా లోకేష్ చెప్పుకొచ్చారు.