దేశంలో వందల సంఖ్యలో పార్టీలు ఉన్నాయి. జాతీయ, ప్రాంతీయ పార్టీలు చాలానే ఉన్నాయి. కానీ, ఏ పార్టీ చేయని పని.. జాతీయ పార్టీలు సైతం.. ఔరా
అని నోరప్పగించి చూసే పనిని ఇప్పుడు టీడీపీ చేస్తోం ది. కాదు..కాదు.. చేసింది.
పార్టీకి కార్యకర్తలే పట్టుకొమ్మలు
అని మనసా వాచా నమ్మే టీడీపీ అధినేత చంద్రబాబు.. ఆ కార్యకర్తల జీవితాలకు భరోసా ఇస్తూ.. సంచలన నిర్ణయం తీసుకున్నారు. పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికీ భవిష్యత్తుపై భరోసా కల్పిస్తూ.. ఒప్పందం చేసుకున్నారు. ఇలా.. ఏ పార్టీ కూడా ఇప్పటి వరకు చేయకపోవడం గమనార్హం.
ఏం చేశారు?
రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఇది 97 లక్షలపైచిలుకుకు చేరుకుంది. మరో నెల రోజుల్లో మరో 3 లక్షల మంది చేరితే.. కోటి మందికి చేరుతుంది. ఈ నేపథ్యంలో వారి పేరున భారీ ఎత్తున టీడీపీ బీమా చేసింది. తాజాగా మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో ప్రఖ్యాత బీమా కంపెనీ యునైటెడ్ ఇండియా ఇన్స్యూరెన్స్
, ప్రాగ్మ్యాటిక్ ఇన్స్యూరెన్స్
ప్రతినిధులు టీడీపీతో ఒప్పందం చేసుకున్నారు. కోటిమంది కార్యకర్తల కోసం ఒకేమారు ఇన్స్యూరెన్స్ సౌకర్యం కల్పించడం ఈ ఒప్పందం ప్రధాన అంశం.
దీని ప్రకారం జనవరి 1, 2025 నుంచి డిసెంబర్ 31,2025 వరకు కోటి మంది కార్యకర్తలకు బీమా వర్తిస్తుంది. ఈ క్రమంలో టీడీపీ తాజాగా తొలి విడత ప్రీమియం కింద రూ.42 కోట్లను కంపెనీలకు చెల్లించింది. వచ్చే ఏడాది కూడా దాదాపు ఇదే మొత్తంలో ప్రీమియం సొమ్మును పార్టీనే చెల్లించుంతుందని మంత్రి నారా లోకేష్ తెలిపారు. ప్రతి ఒక్క కార్యకర్త నిబ్బరంగా ఉండాలని.. ఆ కార్యకర్త కుటుంబం కూడా పదిలంగా ఉండాలన్న ఉద్దేశంతోనే ఈ బీమా ఒప్పందం చేసుకున్నట్టు మంత్రి నారా లోకేష్ తెలిపారు.
ఏంటి ప్రయోజనం..
- ఈ ఒప్పందం ప్రకారం కార్యకర్తలకు రూ.5 లక్షల ప్రమాద బీమా లభిస్తుంది.
- ఒకవేళ కార్యకర్త మృతి చెందితే.. రూ.15 లక్షలను ఆయనపై ఆధారపడిన కుటుంబానికి చెల్లిస్తారు.
- ఏదైనా ప్రమాదంలో గాయపడితే తక్షణ సాయంగా 50 వేల రూపాయలు అందుతుంది.
- ప్రమాదంలో గాయపడి మేజర్ ఆపరేషన్లు అవసరమైన వారికి తక్షణ సాయంగా రూ.2 లక్షలు చెల్లిస్తారు.
- బీమాకు సంబంధించిన సమాచారం కోసం టీడీపీ కేంద్ర కార్యాలయం(మంగళగిరి)లో ప్రత్యేక సెల్ ను ఏర్పాటుచేశారు.