గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓడిపోయిన విషయం తెలిసిందే. కేవలం 11 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. ఈ నేపథ్యంలో ఆ పార్టీ నుంచి పలువురు నాయకులు కాదు.. ఎక్కువ సంఖ్యలోనే నాయకులు పక్కదారి పడుతున్నారు. వారి వారి రాజకీయాలకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుని.. కూటమి పార్టీల్లోకి చేరుతున్నారు. అయితే.. ఈ చేరికల వ్యవహారం.. కూటమి పార్టీలుగా ఉన్న టీడీపీ-బీజేపీ-జనసేన నేతల మధ్య అంతర్గత చర్చలు పెంచుతోంది. నిన్న మొన్నటి వరకు టీడీపీని తిట్టిపోసిన వారిని.. జనసేన తీసుకుంటోందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
ఇక, బీజేపీ కూడా వైసీపీ నేతలను తీసుకుంటోందని.. ఇది సరికాదని.. టీడీపీ కీలక నాయకుడి కుమారుడు ఇటీవల హాట్ కామెంట్లు చేశారు. ఇలాంటివారిని చేర్చుకోవాలని తాము కూడా అనుకుంటే.. బీజేపీ నేతలు ఇబ్బందులు పడతారని కూడా ఆ యువ నేత సంచలన వ్యాఖ్యలు చేశారు. అదేసమయంలో టీడీపీలో చేరేవారిపై జనసేన, జనసేనలో చేరేవారిపై టీడీపీ నాయకులు అంతర్గతంగా చిన్నపాటి విమర్శలు చేసుకుంటున్నారు. ఈ పరిణామాలపై తాజాగా సీఎం చంద్రబాబు స్పందించారు. వైసీపీ నేతల చేరికలపై ఆయన మాట్లాడుతూ.. వారంతా “షెల్టర్” కోసమే పార్టీలు మారుతున్నారని చెప్పారు.
వైసీపీలో ఉన్నవారు షెల్టర్ తీసుకోవడానికి ఈ మూడు పార్టీల్లోకి వస్తున్నారని చంద్రబాబు అన్నారు. అయితే.. పార్టీల్లోనూ ఈ చేరికలపై చర్చ సాగుతోందని తెలిపారు. ఈ విషయంపై మూడు పార్టీలలో చర్చ జరుగుతుందని.. కూటమిగా ఉన్నప్పుడు ఇటు వంటివి జరుగుతుంటాయని పేర్కొన్నారు. అయితే.. చేరికల విషయంలో ఎవరి ఇష్టం వారిదేనన్నారు. అయితే.. చేర్చుకునే ముందు కలిసి చర్చించుకుంటే బాగుంటుందని వ్యాఖ్యానించారు. కొందరు షెల్టర్ కోసం వస్తుంటే.. మరికొందరు కేసుల నుంచి తప్పించుకునేందు కూడా జంప్ చేస్తున్నారని తెలిపారు. ఈ విషయంలో కూటమి పార్టీలుగా తాము కలిసి చర్చించుకుంటామన్నారు.
కాగా.. మంగళగిరి నియోజకవర్గంలో ఇటీవల వైసీపీ నేతలు పార్టీ మారి.. జనసేనలోకి చేరారు. ముఖ్యంగా గతంలో టీడీపీలోనే ఉన్న గంజి చిరంజీవి.. సతీమణితో కలిసి.. పార్టీ మారారు. ఈ వ్యవహారం.. టీడీపీలో చర్చనీయాంశం అయింది. మంత్రి నారా లోకేష్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం కావడం.. ఆయనపైనే గతంలో గంజి చిరంజీవి విమర్శలు చేయడం వంటి పరిణామాల రీత్యా.. టీడీపీ నేతలు గుస్సాగా ఉన్నారు. ఈ పరిణామాల క్రమంలోనే చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.