మచిలీపట్నంలో పేర్ని నానికి చెందిన గోడౌన్ లో రేషన్ బియ్యం మాయం కేసు విచారణ వేగవంతమైంది. ఈ కేసులో ఏ1గా మాజీ మంత్రి పేర్ని నాని భార్య పేర్ని జయసుధ తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే జయసుధకు కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.
ఇక, ఈ కేసులో పేర్ని నానిని కూడా ఏ6గా చేర్చారు. అయితే, తదుపరి ఆదేశాల వరకు నాని పై చర్యలు తీసుకోవద్దని కోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు జయసుధ పోలీసుల విచారణకు హాజరయ్యారు.
తన లాయర్లతో కలసి విచారణకు వచ్చారు. రేషన్ బియ్యం మాయం అంశం గురించి జయసుధ పై పోలీసులు ప్రశ్నల వర్షం కురిపించినట్లు తెలుస్తోంది. జయసుధ పేరటి ఉన్న గోడౌన్ లో నిల్వ ఉన్న బియ్యం బస్తాల సంఖ్యకు, రికార్డుల్లో ఉన్న సంఖ్యకు భారీ తేడా ఎందుకు ఉందని పోలీసులు ప్రశ్నిస్తున్నారట. వేలాది బియ్యం బస్తాల తేడాపై పోలీసులు ఆరా తీస్తున్నారట.
అయితే, వే బ్రిడ్జ్‌లో సమస్యల వల్ల ఈ తేడా వచ్చిందని పౌర సరఫరాల శాఖ అధికారులకు పేర్ని నాని వివరణ ఇచ్చారు. అయితే, మాయమైన రేషన్ బియ్యానికి నగదు చెల్లించేందుకు జయసుధ సుముఖత వ్యక్తం చేసి రూ.1.70 కోట్ల నగదును ప్రభుత్వానికి చెల్లించారు. ఆ తర్వాత జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ మరోమారు గోడౌన్ లో తనిఖీలు చేపట్టడంతో ముందు చెప్పిన సంఖ్య కన్నా మరిన్ని బస్తాలు మాయమైనట్లు గుర్తించారు.
ఆ నగదు కూడా చెల్లించాలని పేర్ని జయసుధకు నోటీసులు జారీ చేశారు. ఈ క్రమంలోనే పేర్ని జయసుధ పోలీసుల విచారణకు నేడు హాజరయ్యారు. గోడౌన్లలో మాయమైన బియ్యం బస్తాలు కాకినాడ పోర్టు ద్వారా విదేశాలకు వెళ్లాయని పోలీసుల విచారణలో నిందితులు అంగీకరించినట్లు తెలుస్తోంది.