ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ దగ్గర వైసీపీ అధినేత జగన్‌కు ప్రత్యేక ముద్ర ఉన్న విషయం తెలిసిందే. ఒకానొక సందర్భంలో కేంద్ర మంత్రి నిర్మలాసీతారామన్ మోడీకి జగన్ దత్తపుత్రుడు అని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.
ఇక, రాజకీయ వర్గాల్లోనూ.. మోడీకి-జగన్‌కు మధ్య అవినాభావ ఆత్మీయత ఉందని.. అందుకే కేసులు కూడా ముందుకు సాగడం లేదన్న వాదన వినిపించింది. మొత్తంగా గత పదేళ్లుగా జగన్‌పై ఒక్క కేసు కూడా ముందుకు సాగకపోవడం ఈ బంధానికి బలం చేకూరుస్తోంది.
ఇదిలావుంటే.. జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ఈ బంధాన్ని బలంగా తుంచే ప్రయత్నం చేస్తున్నారన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. మోడీకి కావాల్సింది.. ఆయనను మెచ్చుకోవడం.. ఆయనను ప్రమోట్ చేయడం. ఆయన తీసుకు వచ్చిన పథకాలను క్షేత్రస్థాయిలో అమలు చేయడం. ఈ విషయాల్లో మోడీని మెచ్చుకోకపోయినా.. ఆయనను ప్రమోట్ చేయకపోయినా.. ఆయన చేపట్టిన కార్యక్రమాలను మాత్రం జగన్ ఏపీలో అమలు చేశారు. దీంతో మోడీ ముగ్ధులయ్యారు.
ఇక, ఇప్పుడు మోడీని ప్రమోట్ చేయడం నుంచి ఆయనను మెచ్చుకునే వరకు.. కూడా పవన్ కల్యాణ్ దూకుడుగానే ముందుకు సాగుతున్నారు. మోడీ అభిలాషలను నెరవేర్చే బీజేపీయేతర నాయకుడిగా ఆయన పేరు తెచ్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా సోమవారం కూడా.. తన మనసులో మాటను చెప్పుకొచ్చారు. మోడీ కలలు సాకారం చేసేందుకు తాను ప్రయత్నిస్తానని చెప్పుకొచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లో జల జీవన్ మిషన్ ద్వారా.. ఇంటింటికీ తాగునీరు అందించాలన్న మోడీ కలలను తాను నెరవేర్చనున్నట్లు పవన్ చెప్పుకొచ్చారు.
అంతేకాదు.. ఇక, బీజేపీ-ఆర్ ఎస్ ఎస్ ల కీలక జీవనాడి అయిన సనాతన ధర్మం, హిందూయిజంపై కూడా పవన్ తనదైన ముద్ర వేశారు. సనాతన ధర్మానికి తానే ప్రతీకగా ఆయన తిరుమల లడ్డూ వ్యవహారం తెరమీదికి వచ్చినప్పుడు దీక్షలు చేశారు. ఇక, మహారాష్ట్ర ఎన్నికల్లోనూ బీజేపీ పిలుపుతో ఆయన ప్రచారం చేశారు. అంటే.. ఒకరకంగా.. నమ్మకమైన మిత్రుడే కాదు.. మోడీకి అత్యంత చేరువ అవుతున్న నాయకుడి గా కూడా.. పవన్ వ్యవహరిస్తున్నారన్నది రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ. ఇది మున్ముందు బలపడితే.. మోడీ దగ్గర జగన్ ముద్ర చెరిగిపోవడం ఖాయమని అంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates