ఆ ఇంటి ఇల్లాలి భర్త కరోనా సమయం కన్నుమూశాడు. ఉన్న ఇద్దరు పిల్లలను సాకుతూ.. ఆ మహిళ ఇంటిని పోషించుకుంటోంది. అనేక కష్టాలు.. నష్టాలు చవిచూసిన కుటుంబం. పట్టుకుంటే పలికే వీణ మాదిరిగా.. కదిలిస్తే కన్నీటి పర్యంతమయ్యే కష్టాల్లో ఉన్న కుటుంబం అది. ఆ కుటుంబానికి సీఎం చంద్రబాబు పెద్దాయన అయ్యారు. కష్టాలు ఆసాంతం విన్నారు. వారికి ధైర్యంతో పాటు మనో వికాసం కలిగించారు. ఆ సాంతం ఆయన ఈ కుటుంబాన్ని తన సొంత కుటుంబంగా భావించి దిశానిర్దేశం చేశారు.
చెప్పడానికి మాటలు చాల్లేదు.. చూడడమే! చంద్రబాబు నోటి నుంచి వచ్చిన దిశానిర్దేశపు పలుకులు వినడమే!! అన్నట్టుగా మంగళవారం నాటి ఘటన ఇప్పటి వరకు సాంత్వన పొందిన అనేక కుటుంబాలకు.. పరాకాష్ఠగా నిలిచింది. రాష్ట్రంలో జనవరి నెల పింఛన్లను ఒక రోజు ముందుగానే పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తానే స్వయంగా రంగంలోకి దిగిన సీఎం చంద్రబాబు ప్రతి నెలా మాదిరిగానే ఒక కుటుంబాన్ని ఎంచుకుని ఆ కుటుంబం కష్టాలు విన్నారు. వారి నష్టాలు ఆలకించారు.
అదే.. పల్నాడు జిల్లాలోని నరసరావుపేట నియోజకవర్గంలో ఉన్న యల్లమంద గ్రామంలోని ఓ కుటుంబం. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన శారమ్మ.. కరోనా సమయంలో తన భర్త మరణంతో కుటుంబం అనేక కష్టాలు ఎదుర్కొంది. భర్త మరణం తర్వాత.. వితంతు పింఛను కోసం వైసీపీ హయాంలో దరఖాస్తు చేసుకుంటే.. అప్పటికి పెండింగు ఉన్న రూ.50 వేల కరెంటు బిల్లు కడితే తప్ప.. ఇచ్చేది లేదని షరతు విధించినట్టు కన్నీటి పర్యంతమైంది.
అప్పు చేసి ఆ సొమ్ములు కట్టాక.. తనకు రూ.2750 పింఛను వచ్చినట్టు శారమ్మ తెలిపింది. తన కుమార్తెను ఆ సొమ్ములతోనే చదివిస్తున్ననని, తన కుమారుడు రోజు కూలీగా వెళ్లి రూ.200 తెచ్చుకుంటున్నట్టు ఆమె చెప్పింది. ఈ కష్టాలు విన్న చంద్రబాబు కరిగిపోయారు. ధైర్యం చెప్పారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రూ.లక్ష రుణం ఇప్పించాలన్న ఆమె వినతిని తక్షణం నెరవేర్చాలని కలెక్టర్‌కు చెప్పారు. శారమ్మ కుమార్తెకు నీట్ కోచింగ్ ఇప్పించాలని అధికారులను ఆదేశించారు. కుమారుడు పనివెళ్తున్నా.. ఖాళీ సమయంలో చదువుకోవాలని.. దిశానిర్దేశం చేశారు. మొత్తంగా.. ఇంటికి పెద్దాయన ఎలా దిశానిర్దేశం చేస్తారో.. అచ్చం అలాగే చంద్రబాబు వ్యవహరించారు. బాబు రాకతో ఆ ఇంట ఒకరోజు ముందుగానే నూతన సంవత్సరం వచ్చేసింది!!