దేశంలో 31 మంది ముఖ్యమంత్రులు ఉన్నారు. వీరిలో కేంద్ర పాలిత ప్రాంతాలైన ఢిల్లీ సహా.. ఇతర రాష్ట్రాలకు చెందిన వారు ఉన్నారు. వీరందరిలోనూ ఏపీ సీఎం చంద్రబాబు సరికొత్త ఘనత నమోదు చేసుకున్నారు. పాలనలో విజన్‌తో దూసుకుపోతున్న ఆయన.. ఇప్పుడు ఆదాయంలోనూ తనకు తిరుగులేదని నిరూపించారు. దేశంలోని ముఖ్యమంత్రుల్లో అత్యధిక ధనవంతుడైన ముఖ్యమంత్రిగా చంద్రబాబు నిలిచారు. ఆయన నికర ఆదాయం 931 కోట్లరూపాయలుగా ఏడీఆర్(అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్స్ రిఫార్మ్స్) సంస్థ తాజాగా వెలువరించిన నివేదిక స్పష్టం చేసింది.
ఇదేసమయంలో చంద్రబాబుకు రూ.10 కోట్ల మేరకు అప్పులు వున్నాయని కూడా తెలిపింది. వ్యాపారాల విషయంలో చంద్రబాబు అనుసరిస్తున్న విధానం.. ఆయన విజన్ వంటివి ఈ ఆదాయానికి కారణమని పేర్కొంది. ఇదంతా కుటుంబ ఆదాయమేనని తెలిపింది. ఇక, రెండో వరుసలో అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖండు నిలిచారు. ఈయన ఆదాయం 332 కోట్ల రూపాయలు. అయితే.. ఈయనకు 180 కోట్ల రూపాయల వరకు అప్పులు ఉన్నాయని తెలిపింది. ఈయన కూడా కుటుంబ వ్యాపారాల ద్వారానే సంపద సంపాయించుకున్నట్టు నివేదిక వివరించింది.
ఇటీవల భూముల కుంభకోణంలో చిక్కుకున్న కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య మాత్రం రూ.51 కోట్ల ఆస్తితో మూడో స్థానంలో ఉన్నారు. ఈయనకు 23 కోట్ల రూపాయల మేరకు అప్పులు ఉన్నట్టు ఏడీఆర్ వివరించింది. కేరళ ముఖ్యమంత్రి, కమ్యూనిస్టు నాయకుడు పినరయి విజయన్ ఆస్తుల విలువ రూ.1.18 కోట్లుగా ఉందని ఏడీఆర్ నివేదిక పేర్కొంది. ఈయన కుటుంబ ఆస్తులు పెద్దగా లేవని పేర్కొంది. ఇక, దేశంలోనే అత్యంత పేద ముఖ్యమంత్రి ఎవరైనాఉన్నారంటే.. ఆమె పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీనేనని ఏడీఆర్ తెలిపింది. ఈమె ఆస్తుల విలువ కేవలం రూ.15 లక్షలు మాత్రమేనని వెల్లడించింది. ఈమె అప్పులు 92 వేల రూపాయలుగా ఉన్నాయని తెలిపింది.
అదేవిధంగా జమ్ము కశ్మీర్ నూతన ముఖ్యమంత్రిగా ఇటీవల బాద్యతలు చేపట్టిన ఒమర్ అబ్దుల్లా ఆస్తులు కేవలం 55లక్షలేనని ఏడీఆర్ నివేదిక వెల్లడించింది. ఈయనకు రూ.3 లక్షల వరకు అప్పులు ఉన్నాయని తెలిపింది. మొత్తంగా 31 రాష్ట్రాల ముఖ్యమంత్రుల ఆస్తుల విలువ రూ.1632 కోట్లుగా ఉందని నివేదిక వెల్లడించింది. వీరిలో 10 మందిపై క్రిమినల్ కేసులు, మరో 10 మందిపై అతి తీవ్రమైన కేసులు ఉన్నాయని తెలిపింది. కాగా.. ఇవన్నీ.. ఈ ఏడాదివారు ఐటీకి సమర్పించిన ఆస్తుల వివరాల ఆధారంగా నివేదిక రూపొందించినట్టు ఏడీఆర్ వివరించింది.