తెలుగు త‌ల్లికి జ‌ల హార‌తి.. ఏపీకి గేమ్ ఛేంజ‌ర్‌: చంద్ర‌బాబు

ఏపీ సీఎం చంద్ర‌బాబు రాష్ట్రానికి సంబంధించి స‌రికొత్త ప్రాజెక్టును ప్ర‌క‌టించారు. దీనికి ‘తెలుగు త‌ల్లికి జ‌ల హార‌తి’ అనే పేరును పెట్ట‌డం గ‌మ‌నార్హం. ఈ ప్రాజెక్టుల‌కు ఏపీకి గేమ్ ఛేంజ‌ర్ అవుతుంద‌ని సీఎం చెప్పారు. ఈ ప్రాజెక్టు ద్వారా గోదావ‌రి-కృష్ణా న‌దుల జలాల‌ను రాయ‌ల‌సీమ‌కు మ‌ళ్లించ‌నున్న‌ట్టు తెలిపారు. మొత్తంగా 300 టీఎంసీల జ‌లాల‌ను సీమ జిల్లాల‌కు అందించ‌నున్నారు. ఈ ప్రాజెక్టును మూడు ద‌శ‌ల్లో నిర్మించ‌నున్నారు. కన్నతల్లికి రుణం తీర్చుకోవడం అనే అర్థంలో ఈ పేరు పెట్టామ‌ని చంద్ర‌బాబు వివ‌రించారు.

ఏంటీ ప్రాజెక్టు?

ప్ర‌స్తుతం రాయ‌ల‌సీమలోని ప‌లు జిల్లాలు సాగునీరు లేక ఇబ్బందులు ప‌డుతున్నాయి. దీనివ‌ల్ల వ‌ల‌స‌లు కూడా పెరిగిపోయి.. ప్ర‌జ‌లు దుర్భ‌ర ప‌రిస్థితుల‌ను ఎదుర్కొంటున్నారు. ఒక్క సీమ జిల్లాలే కాకుండా.. ప్ర‌కాశం, నెల్లూరు జిల్లాల్లోనూ త‌ర‌చుగా క‌రువు ప‌రిస్థితులు నెల‌కొంటున్నాయి. ఈ నేప‌థ్యంలో ఆయా జిల్లాల‌కు సాగునీరు అందించాల‌న్న‌ది ‘తెలుగు త‌ల్లికి జ‌ల హార‌తి’ ప్రాజెక్టు ప్ర‌ధాన ఉద్దేశం. ఈ ప్రాజెక్టు పూర్త‌యితే.. న‌దుల అనుసంధానంతో పాటు.. ఆయా జిల్లాల ప్ర‌జ‌ల‌కు సాగునీరు, అదేవిధంగా మ‌రిన్ని ప్రాంతాల‌కు తాగునీరు అంద‌నుంది.

ఎక్క‌డ నుంచి ఎక్క‌డి దాకా?

తెలుగు త‌ల్లికి జ‌ల హార‌తి ప్రాజెక్టును గోదావ‌రి-కృష్ణాన‌దుల నీటిని క‌ల‌ప‌డం ద్వారా.. బ‌న‌క‌చ‌ర్ల‌కు తీసుకువెళ్తారు. ఈ నీరు కృష్ణా ప‌శ్చిమ ప్రాంతం నుంచి తూర్పుడెల్టాల‌కు నీరు ఇచ్చిన త‌ర్వాత‌.. ఇక్క‌డ నుంచి బ‌న‌క‌చ‌ర్ల‌కు త‌ర‌లిస్తారు. మొత్తం గోదావ‌రిలోని మిగులు జ‌లాల‌ను ఈ ప్రాజెక్టు ద్వారా పొలాల‌కు మ‌ళ్లించ‌నున్నారు. గోదావరి నుంచి కనీసం 300 టీఎంసీల నీటిని కృష్ణా నదికి తీసుకువ‌స్తారు. ఇక్కడి నుంచి క‌ర్నూలు జిల్లాలోని బనకచర్లకు నీటిని పంపుతారు. ఇది మొత్తం మూడు ద‌శ‌ల్లో నిర్మాణం అవుతుంది.

దీని వ‌ల్ల ప్ర‌కాశం జిల్లా వ్యాప్తంగా, నెల్లూరులోని కొన్ని ప్రాంతాల‌కు సాగునీరు అంద‌నుంది. అయితే.. ఈ ప్రాజెక్టు కోసం న‌ల్ల‌మ‌ల అట‌వీ(క‌ర్నూలు) ప్రాంతంలో ట‌న్నెల్ నిర్మాణం జ‌ర‌గాల్సి ఉంటుంద‌ని సీఎం తెలిపారు. ఈ ప్రాజెక్టు వివ‌రాల‌ను ప్ర‌ధాని మోడీకి పంపించిన త‌ర్వాత‌.. కేంద్ర సాయంతో ప‌నులు ప్రారంభించ‌నున్న‌ట్టు తెలిపారు. సాధ్య‌మైనంత వేగంగా ప్రాజెక్టును అందుబాటులోకి తీసుకువ‌చ్చే ప్ర‌య‌త్నం చేస్తామ‌ని చంద్ర‌బాబు వివ‌రించారు. ఈ ప్రాజెక్టుకు ప్రాణం పోస్తే.. ఏపీకి గేమ్ ఛేంజ‌ర్‌(మ‌రో మ‌లుపు) అవుతుంద‌న్నారు.