పేద్ద గన్ పట్టుకుని.. ఆరు అడుగుల ఎత్తుతో చూడగానే నేరస్తుల గుండెల్లో గుబులు పుట్టించేలా ఉన్న ఈ అధికారి.. ఐపీఎస్ అని అందరూ అనుకుంటారు. కానీ, ఈయన నకిలీ ఐపీఎస్. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. ఇటీవల మన్యంలో పర్యటించినప్పుడు.. ఈయన ఆసాంతం ఆయన పర్యటనలోనే ఉన్నాడు. పైగా అధికారులను కూడా గదమాయించాడట. తాజాగా ఈ విషయం వెలుగు చూసింది. వాస్తవానికి ఈయన నకిలీ అన్న విషయాన్ని సాధారణ పోలీసులు కూడా గుర్తించలేక పోయారంటే ఆశ్చ ర్యం వేస్తుంది.
చివరకు.. డిప్యూటీ సీఎం కార్యాలయంలో పవన్ కల్యాణ్ పర్యటనకు సంబంధించిన అధికారుల జాబితాను పరిశీలించగా.. జాబితాలో లేని అధికారి, ఫొటోలలో కనిపించేసరికి విషయాన్ని ఉన్నతాధికారులకు పంపించారు. దీంతో వారు పరిశీలించి.. నకిలీ ఐపీఎస్ అధికారిగా గుర్తించారు. ‘వై’ కేటగిరీ భద్రతలో ఉన్న డిప్యూటీ సీఎం… భద్రతాలోపాలపై హోం మంత్రి అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై సమగ్ర విచారణకు ఆదేశించారు.
అసలు ఏం జరిగింది?
ఇటీవల మన్యం జిల్లా సాలూరు నియోజకవర్గం పాచిపెంట మండలానికి పర్యటనకు పవన్ కళ్యాణ్ వెళ్లిన విషయం తెలిసిందే. అక్కడి గిరిజనులతో ఆయన మమేకమయ్యారు. చెప్పులు లేకుండానే బురదలో నడిచారు. ఈ వార్తలు సోషల్ మీడియాలో బాగానే వైరల్ అయ్యాయి. అయితే.. పవన్ కళ్యాణ్ వచ్చిన సమయంలో ఆయన వెన్నంటే ఉండి ఐ.పి.ఏస్ ఆఫీసర్ లా కలియ తిరిగిన వ్యక్తి.. నకిలీ అధికారి అనే విషయం మాత్రం ఎవరూ గుర్తించలేక పోయారు. అంతేకాదు.. పవన్ పర్యటన అనంతరం కింది స్థాయి సిబ్బందితో ఫోటోలుకు ఫోజులు కూడా ఇచ్చారు.
పర్యటన తర్వాత ఫోటోలు బయటకు రావడంతో ఎంక్వైరీ చేసిన మన్యం జిల్లా పోలీసులు.. నకిలీ ఆఫీసర్ అని తేలడంతో ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చి.. సదరు నకిలీని అదుపులోకి తీసుకున్నారు. ఇతను గరివిడి మండలానికి చెందిన బలివాడ సూర్య ప్రకాష్ అనే వ్యక్తిగా గుర్తించారు. అయితే.. తాను పవన్‌కల్యాణ్‌కు అభిమానని.. అందుకే ఇలా వేషం వేశానని ఒప్పుకొన్నట్టు పోలీసులు చెబుతున్నారు. కానీ.. ఈ విషయాన్ని చాలా సీరియస్‌గా తీసుకున్న హోం శాఖ.. విచారణకు ఆదేశించింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates