రాజకీయాల్లో ఏమైనా జరగొచ్చు. ఎప్పుడు ఏం జరిగినా.. నాయకులు తమ మంచికేనని అనుకుంటారు. అయితే.. ఒక్కొక్కసారి జరిగే పరిణామాలు సంచలనాలకు వేదికగా మారుతుంటాయి. ఇప్పుడు అలాంటి పరిణామమే వైసీపీలోనూ జరగనుంది. కీలక నాయకుడు, ఫైర్ బ్రాండ్ కొడాలి నాని.. రాజకీయంగా సన్యాసం తీసుకునే దిశగా అడుగులు వేస్తున్నట్టు తెలిసింది. దీనిపై త్వరలోనే ఆయన ప్రకటన చేయనున్నట్టు గుడివాడలో చర్చ సాగుతోంది.
రాజకీయంగా కొడాలి నాని దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు కొడాలికి అత్యంత సన్నిహితంగా ఉన్న అనుచరులు చెబుతున్నారు. ప్రస్తుతం కొడాలి నాని అనారోగ్యంతో ఉన్నారని, ఆయన హైదరాబా ద్‌లో చికిత్స పొందుతున్నారన్నది గుడివాడ నియోజకవర్గంలో జరుగుతున్న చర్చ. అయితే.. ఈ రోజు కాకపోతే.. రేపైనా ఆయన నియోజకవర్గంలో యాక్టివ్ అవుతారని అందరూ భావించారు. కానీ, ప్రస్తుతం ఉన్న పరిస్తితులు.. రాజకీయంగా ఎదురయ్యే సవాళ్లను పరిగణనలోకి తీసుకున్నారు.
ఈ క్రమంలోనే కొడాలి నాని సంచలన నిర్ణయం తీసుకున్నారన్నది ఆయన వర్గం చెబుతున్న మాట. వాస్తవానికి ఈ ఏడాది జరిగిన ఎన్నికలే తనకు చివరి ఎన్నికలని.. వచ్చే ఎన్నికల నాటికి తాను పోటీ చేసేది కూడా లేదని నాని చెప్పుకొచ్చారు. అయితే.. దీనిని రాజకీయంగా ఆయన సెంటిమెంటుకోసం వాడుకున్నారని అనుకున్నా.. తాజా ఎన్నికల్లో ఆయన ఓడిపోయిన తర్వాత ఎక్కడా కనిపించడం లేదు. పైగా కూటమి సర్కారు కేసులు పెడుతుందన్న బెరుకు ఉందని కొందరు అంటున్నారు.
కానీ, అనారోగ్య సమస్యలు.. ఇతరత్రా సమస్యల కారణంగానే నాని రాజకీయాల నుంచితప్పుకొని.. వ్యాపారాలకే పరిమితం అవుతారని తెలుస్తోంది. వచ్చే ఎన్నికల నాటికి ఆయన దాదాపు రాజకీయాల్లో ఉండే పరిస్థితి కూడా లేదని అనుచరుల నుంచి వినిపిస్తున్న మాట. మరి ఈయన గ్యాప్ ను ఎవరు ఫిలప్ చేస్తారనేది చూడాలి. ప్రస్తుతం ఉన్న అంచనాల మేరకు.. కొడాలి తమ్ముడు కొడుకు నియోజకవర్గంలో రంగంలోకి దిగే ప్రయత్నాల్లో ఉన్నట్టు తెలుస్తోంది. కొడాలి కనుక రాజకీయాల నుంచి నిజంగానే తప్పుకొంటే గుడివాడలోనేకాదు.. రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనమే.