కారణాలు లేవని పేర్కొంటూనే.. రాజకీయాల నుంచి తప్పుకొన్నారు మాజీ ఐఏఎస్ అధికారి ఏఎండీ ఇంతియాజ్. వైసీపీకి ఆయన గుడ్ బై చెప్పారు. తాను స్వచ్చందంగానే రాజకీయాల నుంచి తప్పుకొంటున్నట్టు ప్రకటించారు. ఎక్కడా ఎవరినీ ఆయన విమర్శించలేదు. పన్నెత్తు మాట కూడా అనలేదు. తాను నమ్మిన ప్రజాసేవకు స్వచ్ఛందంగానే అంకితం కావాలని అనుకుంటున్నట్టు పేర్కొన్నారు. సాహిత్యమంటే తనకు అభిలాష అని పేర్కొన్న ఇంతియాజ్.. పర్యావరణ పరిరక్షణకు కూడా తాను నడుంబిగించనున్నట్టు తెలిపారు.
కాగా.. ఈ ఏడాది జరిగిన ఎన్నికలకు ముందు వరకు ఆయన ఐఏఎస్ అధికారిగానే ఉన్నారు. అయితే.. ‘మళ్లీ మనదే అధికారం’ అన్న వైసీపీ నేతల వ్యాఖ్యలు.. అప్పటి ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ ధీమా వెరసి.. ఇంతియాజ్‌ను ఐఏఎస్ నుంచి రాజకీయాల దిశగా అడుగులు వేసేలా ప్రోత్సహించాయి. ఈ క్రమంలోనే రాత్రికి రాత్రి ఆయన తన ఐఏఎస్ పదవికి రాజీనామా చేశారు. ఆ మరుసటి రోజే దీనిని ప్రభుత్వం ఆమోదించింది. ఆ వెంటనే.. గంటల సమయంలోనే ఆయన వైసీపీ కండువా కప్పుకొన్నారు. ఆ మరుసటి రోజే ఇంతియాజ్‌కు కర్నూలు అసెంబ్లీ సీటు కేటాయించారు.
ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో ఆయన కర్నూలు నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. తాను గెలిస్తే.. మంత్రిని కూడా అవుతానని కొన్ని సందర్భాల్లో ఆయన చెప్పకొచ్చారు.కానీ, కూటమి పార్టీల ప్రభావంతో బలమైన నియోజకవర్గంలో వైసీపీ పరాజయం పాలైంది. ఇక, అప్పటి నుంచి కూడా.. ఇంతియాజ్ మౌనంగా ఉంటున్నారు. పార్టీ కార్యక్రమాలకు కూడా హాజరు కావడం లేదు. అయితే.. ఇంతియాజ్‌కు సొంత పార్టీలోనే కుంపట్లు ఏర్పడ్డాయి. ఆయన అభ్యర్థిత్వాన్ని ఆనాడే సీనియర్లు వ్యతిరేకించారు. అయినా.. జగన్ వారిని బుజ్జగించడం మానేసి.. ఇంతియాజ్‌ను గెలిపించాల్సిందేనని హుకుం జారీ చేశారు.
కానీ, జగన్ హుకుంలు ఎక్కడా పనిచేయలేదు. ఫలితంగా ఇంతియాజ్ ఘోర పరాజయం పాలయ్యారు. ఆ తర్వాత కూడా ఆధిపత్య ధోరణితో సీనియర్ నాయకులు ఆయనను పక్కన పెట్టారు. దీనిపై ఒకటికి రెండు సార్లు పార్టీ అధిష్టానం దృష్టికి తన పరిస్థితిని వివరించారు. అయినా.. జగన్ ఎవరినీ పట్టించుకోనట్టుగానే ఈయనను కూడా పట్టించుకోలేదు. ఈ పరిణామాలతో మనస్తాపం చెందిన ఇంతియాజ్.. పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకొంటున్నట్టు ప్రకటించారు. కానీ, ఆయనకు టీడీపీ నుంచి ఆహ్వానాలు అందుతున్నాయి. ఈ విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది. ఇదే నిజమైతే.. చంద్రబాబు ఆయనకు మంచి పొజిషనే ఇవ్వనున్నారని సమాచారం. వివాద రహితుడిగా పేరుండడమే ఇంతియాజ్‌కు ఉన్న మైలేజీ!!
Gulte Telugu Telugu Political and Movie News Updates