చింత‌కాయ‌ల వ‌ర్సెస్ చిన్న‌మ్మ‌.. ఇంట్ర‌స్టింగ్ పాలిటిక్స్‌!

ఏపీలో వైసీపీ నాయ‌కుల‌ను కూట‌మి పార్టీలు చేర్చుకుంటున్న విష‌యం తెలిసిందే. అయితే..ఇప్ప‌టి వ‌ర‌కు కూట‌మిలోని టీడీపీ, జ‌న‌సేన మ‌ధ్యే ఈ త‌ర‌హా రాజ‌కీయాలు సాగుతున్నాయి. ఈ రెండు పార్టీల అధినేత‌లు.. సీఎం చంద్ర‌బాబు, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌లు.. ఆలోచించి.. త‌మ‌కు అనుకూలంగా ఉన్న వైసీపీ నాయ‌కుల‌ను చెరో పార్టీలోకి చేర్చుకుంటున్నారు. ఈ క్ర‌మంలో వారి గ్రాఫ్‌ను ప‌రిశీలిస్తున్నారు. దీంతో ఈ రెండు పార్టీల మ‌ధ్య వివాదాల‌కు అవ‌కాశం లేకుండా.. జంపింగులు జ‌రుగుతున్నాయి.

అయితే.. మేం మాత్రం త‌క్కువ‌గా అంటూ.. బీజేపీ కూడా ఇప్పుడు రంగంలోకి దిగింది. వైసీపీ నుంచి వ‌చ్చే వారికి రెడ్ కార్పెట్ ప‌రుస్తూ.. వ‌చ్చిన వారిని వ‌చ్చిన‌ట్టు చేర్చుకునేలా వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తోంది. ఈ క్ర‌మంలో తాజాగా విశాఖ‌ప‌ట్నానికి చెందిన విశాఖ డెయిరీ చైర్మ‌న్, వైసీపీ నాయ‌కుడు ఆడారి ఆనంద్‌కుమార్‌ను బీజేపీలోకి చేర్చుకున్నారు. బీజేపీ రాష్ట్ర చీఫ్ పురందేశ్వ‌రి ఆయ‌నకు కండువా క‌ప్పి.. క‌మ‌ల తీర్థం ఇచ్చారు. ఇక నుంచి ఆడారి.. త‌మ నాయ‌కుడేన‌ని ప్ర‌క‌టించారు.

ఇదే ఇప్పుడు స్పీక‌ర్ చింత‌కాయ‌ల అయ్య‌న్న‌పాత్రుడ‌కు.. బీజేపీ చీఫ్ పురందేశ్వ‌రి ఉర‌ఫ్ చిన్న‌మ్మ‌కు మ‌ధ్య పొలిటిక‌ల్ గ్యాప్ పెరిగేలా చేసింది. అస‌లు ఆడారిని బీజేపీలోకి ఎలా చేర్చుకుంటార‌ని స్పీక‌ర్ త‌న‌యుడు, టీడీపీ యువ నాయ‌కుడు చింతకాయ‌ల విజ‌య్ పాత్రుడు ప్ర‌శ్నించారు. అంతేకాదు.. త‌న తండ్రిని ఓడించేందుకు న‌ర్సీప‌ట్నంలో కంక‌ణం క‌ట్టుకున్న ఆడారిని బీజేపీలోకి ఎలా ఆహ్వానిస్తార‌ని.. పోనీ.. ఇలా చేసే ముందు త‌మ‌కు ఒక్క మాటైనా ఎందుకు చెప్ప‌లేద‌ని ఆయ‌న నిల‌దీశారు.

ఇక్క‌డితోకూడా విజ‌య్ ఆగ‌లేదు. త‌మ‌కు కూడా.. వైసీపీ నాయ‌కుల‌ను ఆహ్వానించ‌డం తెలుసున‌ని.. రాజ‌మండ్రి పార్ల‌మెంటు స్థానంలో పురందేశ్వ‌రిని ఓడించేందుకు ప్ర‌య‌త్నించిన కీల‌క నాయ‌కుల‌ను తాము కూడా.. ఆహ్వానించి టీడీపీలోకి చేర్చుకుంటే అప్పుడు త‌మ బాధేమిటో మేడం పురందేశ్వ‌రికి తెలుస్తుంద‌ని ఘాటుగానే చెప్పుకొచ్చారు. తాము సుదీర్ఘ‌కాలంగా రాజ‌కీయాల్లో ఉన్నామ‌ని.. ఒక పార్టీని వ‌దిలి మ‌రోపార్టీలోకి జంప్ చేసే సంస్కృతి మాకు లేద‌ని ప‌రోక్షంగా చిన్న‌మ్మ‌పై విమ‌ర్శ‌లు గుప్పించారు. కూట‌మిలో ఉన్న‌ప్పుడు.. క‌నీసం స‌మాచారం ఇచ్చే సంస్కృతిని పాటిస్తే బాగుండేద‌న్నారు. మ‌రి ఈ వ్య‌వ‌హారంపై చిన్న‌మ్మ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.