వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా ఎదగడానికి, ముఖ్యమంత్రి కావడానికి సింపతీ బాగా ఉపయోగపడిందనడంలో సందేహం లేదు. తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణాన్ని తట్టుకోలేక చనిపోయిన వారిని పరామర్శించే పేరుతో ఏళ్ల తరబడి ఓదార్పు యాత్ర చేసి కావాల్సినంత సానుభూతిని రాబట్టుకున్నాడు జగన్. 2019 ఎన్నికల్లో అధికారంలోకి రావడానికి సానుభూతి ఫ్యాక్టర్ బాగా ఉపయోగపడిందన్నది స్పష్టం.
ఐతే అధికారంలోకి వచ్చాక ఐదేళ్లు ఏం జరిగిందో అందరూ చూశారు. ఈ ఏడాది ఎన్నికల్లో జగన్‌కు ఘోర పరాభవాన్ని కట్టబెట్టారు. ఐతే ఇప్పుడు ప్రతిపక్షంలోకి రాగానే జగన్ మళ్లీ సానుభూతి ఫ్యాక్టర్ మీద దృష్టిపెట్టారు. నాటకీయ శైలిలో మాట్లాడుతూ.. మళ్లీ జనాల్లో సానుభూతి రాబట్టడానికి ప్రయత్నిస్తున్నారు.
తాజాగా కార్యకర్తల సమావేశంలో జగన్ మాట్లాడుతూ.. తాను పడ్డ కష్టాల గురించి ఏకరవు పెట్టారు. ఓటమి పాలయ్యాం కదా అని నీరుగారి పోవాల్సిన అవసరం లేదని.. కష్టాలను ఎలా ఎదుర్కోవాలో చెప్పడానికి తన జీవితమే ఉదాహరణ అని ఆయన వ్యాఖ్యానించారు. తాను పడ్డ కష్టాలను బహుశా ఏ రాజకీయ నాయకుడూ పడి ఉండడని జగన్ అన్నారు.
తండ్రి మరణానంతరం తన చుట్టూ ఎవ్వరూ లేరని.. తాను, తన తల్లి మాత్రమే కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి వచ్చామని.. కొత్త పార్టీ పెడితే అది లేకుండా చేయాలని తన మీద తప్పుడు కేసులు పెట్టి జైల్లో వేశారని జగన్ అన్నారు. తాను జైల్లో ఉన్నపుడు బెయిల్ కోసం తన భార్య భారతి పడరాని కష్టాలు పడిందని.. 30 సార్లు బెయిల్ కోసం పిటిషన్లు పెట్టిందని.. ప్రతిసారీ ఏదో కారణం చెప్పి తిరస్కరించేవారని.. అప్పుడు రాష్ట్రంలో, కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీతో చంద్రబాబు నాయుడు చేతులు కలిపి తనకు బెయిల్ రాకుండా చేశారని జగన్ ఆరోపించారు. ఇంత చేసినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా తనను ముఖ్యమంత్రి కాకుండా ఆపలేకపోయారని.. కాబట్టి ఇప్పుడు కార్యకర్తలందరూ కష్టాలకు బెదరకుండా పోరాడి మళ్లీ అధికారం చేపట్టడానికి తోడ్పడాలని జగన్ పిలుపునిచ్చారు.
ఐతే ఇంతకుముందు జగన్ కేసులు, జైలు జీవితంతో ఇబ్బందులు పడ్డ మాట వాస్తవమే కావచ్చు కానీ.. అవన్నీ తప్పుడు కేసులు, తాను అవినీతే చేయలేదు అంటే జనం నమ్మే పరిస్థితుల్లో ఉన్నారా అన్నది ప్రశ్న. ఇక గత ఐదేళ్లు అంతులేని అధికారం అనుభవించాక ఇప్పుడు తాను గతంలో పడ్డ కష్టాల గురించి ఏకరవు పెట్టి సానుభూతి రాబట్టాలని చూస్తే వర్కవుట్ అవుతుందా అన్నది సందేహం.
Gulte Telugu Telugu Political and Movie News Updates