తిరుమల తిరుపతి దేవస్థానంలో (టీటీడీ) హుండీ నగదు లెక్కింపు ప్రక్రియలో భారీ కుంభకోణం జరిగినట్లు టీటీడీ పాలక మండలి సభ్యుడు భానుప్రకాశ్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. హుండీ నగదుతో పాటు విదేశీ కరెన్సీ సొమ్మును రహస్యంగా ఎత్తుకెళ్లినట్లు పేర్కొన్నారు. హుండీ నగదు లెక్కింపు నిర్వహించే పరకామణిలో ఈ అక్రమాలు జరిగాయని, ఈ వ్యవహారంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
పెద్ద జీయర్ తరఫున సి.వి. రవికుమార్ అనే వ్యక్తి హుండీ నగదును లెక్కించేవారిగా చెప్పిన భానుప్రకాశ్ రెడ్డి, ఆయన రహస్యంగా రూ.100 కోట్ల విదేశీ కరెన్సీని పొట్టలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అరలో దాచుకుని తరలించారని ఆరోపించారు.
2023 ఏప్రిల్ 29న రవికుమార్ హుండీ నగదుతో పట్టుబడినప్పటికీ, ఆ కేసు లోక్ అదాలత్‌లో రాజీ కుదిరిందని తెలిపారు. అయితే, ఆ కేసు వెనుక ఉన్న నిజాలను వెలుగులోకి తేవాలని, పాలక మండలి వెంటనే స్పందించాలని భానుప్రకాశ్ డిమాండ్ చేశారు.
ఈ కేసులో నాటి టీటీడీ చైర్మన్ సహా కొంతమంది ఉన్నతాధికారులు రవికుమార్‌ను బెదిరించి, ఆయన వద్ద రూ.100 కోట్ల ఆస్తులను రాయించుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. పరకామణి వ్యవస్థలో ఈ తరహా కుంభకోణాలు భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీస్తాయని భానుప్రకాశ్ పేర్కొన్నారు.
హుండీ నగదు లెక్కింపులో పారదర్శకత అవసరమని, భద్రతా చర్యలను మరింత కఠినంగా అమలు చేయాలని సూచించారు. తిరుమలలోని ఈ కుంభకోణం సమాచారం బయటికొచ్చిన నేపథ్యంలో భక్తులు, పాలక మండలి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. ఇక ఈ ఆరోపణలు నిజమా? కేవలం అవతలి వర్గాల కుట్రా? అన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates