ఐఏఎస్ అధికారి.. శ్రీలక్ష్మి గురించి రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశ వ్యాప్తంగా తెలుసు. దీనికి కారణం .. దేశంలోనే తొలిసారి ఒక మహిళా ఐఏఎస్ అధికారి సుదీర్ఘకాలం జైల్లో ఉండడం! కారణాలు ఏవైనా కూడా.. అవినీతి చుట్టూ అలుముకున్న పంజరంలో చిక్కిన శ్రీలక్ష్మి.. అక్రమాలకు ఒత్తాసు పలికారని.. అప్పట్లోనే సీబీఐ తేల్చింది. తర్వాత.. కేసులో అరెస్టు కావడం.. సుదీర్ఘ కాలం జైల్లోనే ఉండడం అప్పట్లో సంచలనాలు. అయితే.. ఇప్పుడు అవే శాపాలుగా మారాయి.
వైఎస్ రాజశేఖరరెడ్డి జమానాలో గనుల శాఖ కార్యదర్శిగా ఉన్న శ్రీలక్ష్మి చేసిన సంతకాలు.. తర్వాత కాలంలో ఆమెకు చిక్కులు తెచ్చిపెట్టారు. ఏ కారణంతో కళ్లు మూసుకుని సంతకాలు పెట్టారో.. అని సీబీఐ తన చార్జిషీట్‌లో స్పష్టం చేసింది. అలా.. ఆమె చాలా రోజుల పాటు జైలు జీవితాన్ని గడపాల్సి వచ్చింది. ఆ తర్వాత.. బయటకు వచ్చినా.. ఆమెకు తగ్గ పోస్టు అయితే దక్కలేదు. ఇక, రాష్ట్ర విభజన తర్వాత.. తొలి ఐదేళ్లపాటు అంటే 2019 వరకు తెలంగాణలోనే ఉన్నారు.
ఆతర్వాత.. ఏపీలో మళ్లీ వైఎస్ జగన్ పాలన ప్రారంభమైన తర్వాత.. ఆఘమేఘాలపై ఆమెను ఏపీకి తీసు కువచ్చారు. కీలక పదవిని కట్టబెట్టారు. మళ్లీ అక్రమాల ఆరోపణలే వినిపించాయి. ఇక, కూటమి సర్కారు వచ్చిన తర్వాత.. శ్రీలక్ష్మి.. మళ్లీ పక్కకు తప్పుకోవాల్సి వచ్చింది. ఆమెకు ఇప్పటి వరకు కూటమి సర్కారు పోస్టింగు ఇవ్వలేదు. అయితే.. ఇప్పుడు అసలు కథ తెరమీదికి వచ్చింది. ప్రస్తుతం ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న నీరభ్ కుమార్ ప్రసాద్.. మరో వారంలో పదవీ విరమణ చేయనున్నారు.
మరి ఈయన తర్వాత.. అత్యంత కీలకమైన.. అధికార వర్గాన్ని, పాలనను కూడా ముందుకుతీసుకువెళ్లే.. స్థాయిలో ఉన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పోస్టును ఎవరికి ఇవ్వాలి? అనే ప్రశ్న వస్తే.. నీరభ్ కుమార్ తర్వాత.. స్థాయి, స్థానంలో శ్రీలక్ష్మే ఉన్నారు. ఇప్పుడున్న ఐఏఎస్ అధికారుల్లో ఆమే అత్యంత సీనియర్ అధికారి. దీంతో ఆమే తదుపరి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కావాల్సి ఉంటుంది.
కానీ, ఆమె చేసుకున్న పాపం.. కేసుల్లో చిక్కుకున్న తీరు కారణంగా.. ఆమె పేరు పరిశీలనలోనే లేకుండా పోయింది. కనీసం.. ఆమె ఈ జాబితాలో ఎక్కడా లేకపోవడం గమనార్హం. మొత్తంగా చూస్తే.. వైఎస్ ఎఫెక్ట్.. వెంటాడిన పాపం.. శ్రీలక్ష్మికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పోస్టు లేకుండా చేసేసింది. జీవితంలో ఐఏఎస్‌లు.. ఈ పోస్టు కోసం ఎంతో శ్రమిస్తారన్న విషయం.. కలలు కంటారన్న విషయం తెలిసిందే.