ప్ర‌తి రోజూ అటెండెన్స్‌.. చంద్ర‌బాబు మ‌రో నిర్ణ‌యం

ఏపీ సీఎం చంద్ర‌బాబు మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. త‌న కేబినెట్ మంత్రుల‌కు ప‌క్కా నిబంధన అమ‌లు చేయాల‌ని నిర్ణ‌యించారు. జ‌న‌వ‌రి 1వ తేదీ నుంచి అమ‌లు చేసే ఈ నిబంధ‌న‌ను అంద‌రూ త‌ప్ప‌నిస‌రిగా పాటించాల‌ని ఆదేశించారు. ప్ర‌స్తుతం అధికారుల‌కు, ఉద్యోగుల‌కు మాత్ర‌మే ప‌రిమిత‌మైన అటెండెన్సును.. ఆయ‌న మంత్రుల‌కు కూడా విస్త‌రించారు. జ‌న‌వ‌రి 1వ తేదీ నుంచి నూత‌నంగా అందు బాటులోకి తీసుకువ‌చ్చే ప్ర‌త్యేక యాప్‌లో అటెండెన్స్ వేయ‌నున్నారు.

ప్ర‌త్యేక యాప్‌ను ఇప్ప‌టికే ప్రాథ‌మికంగా ప‌రిశీలించారు. దీనిని జ‌న‌వ‌రి 1వ తేదీ నుంచి అమ‌లు చేయ‌నున్నారు. మంత్రులు ఎక్క‌డ ఉన్నా… వారు త‌మ ఫోన్ల‌లో అటెండెన్స్ వేయాల్సి ఉంటుంది. అంటే.. వారు నిరంత‌రం.. ప‌నిలో ఉంటున్నారా? లేక సొంత వ్య‌వ‌హారాలు చేసుకుంటున్నారా? అనే విష‌యంపై చంద్ర‌బాబు ప‌క్కాగా ప‌రిశీలించ‌నున్నారు. ఈ క్ర‌మంలో మంత్రులు అందరూ.. ఉద‌యం 11 గంట‌ల‌లో ప‌ల‌.. తాము ఎక్క‌డ విడిది చేసినా.. ఏ ప‌నిలో ఉన్నా.. యాప్ ద్వారా అటెండెన్సు వేయాల్సి ఉంటుంది.

ఇది సీఎం డ్యాష్ బోర్డుకు చేరుతుంది. మంత్రుల ప‌నితీరును అంచ‌నా వేయ‌డంలో దీనికి కూడా ప్ర‌ధాన మార్కులు ఉండే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. 2015-19 మ‌ధ్య కూడా.. కొన్నాళ్లు ఈ ప్ర‌య‌త్నం చేసినా.. అది విఫ‌ల‌మైంది. కానీ, ఇప్పుడు ప‌క్కాగా అమ‌లు చేయాల‌ని చంద్ర‌బాబు నిర్ణ‌యించుకున్నారు. తాను కూడా ఈ అటెండెన్సును వేయ‌నున్నారు. అదేవిధంగా.. మంత్రుల షెడ్యూల్‌ను కూడా విడుద‌ల చేయనున్నారు.

ప్ర‌స్తుతం షెడ్యూల్ విడుద‌ల చేసే విష‌యంలో సీఎం చంద్ర‌బాబు ముందున్నారు. డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ ప‌రిస్థితుల‌ను బ‌ట్టి.. షెడ్యూల్ ఉంటోంది. ఇక‌, మంత్రుల‌ విష‌యంలో వారు ఎలాంటి ప‌నులు చేస్తున్నారో.. ఏం చేస్తున్నారో.. కూడా తెలియ‌ని ప‌రిస్థితి నెల‌కొంది. ఈ నేప‌థ్యంలో అటు అటెండెన్సు.. ఇటు షెడ్యూల్ రెండూ కూడా.. జ‌న‌వ‌రి 1 నుంచి అమ‌లు చేయ‌నున్నారు. అయితే.. సెల‌వు దినాలు, పండుగ‌లు వంటి రోజుల్లో మిన‌హాయింపు ఉంటుంది. కాగా.. ఈ విధానం అమ‌లు చేస్తున్న రెండో రాష్ట్రం ఏపీ కావ‌డం విశేషం. తొలుత ఈ విధానాన్ని ఢిల్లీలో కేజ్రీవాల్ అమ‌లు చేశారు.