నేటి నుంచి ట్రాఫిక్ విధుల్లోకి ట్రాన్స్ జెండర్లు!

హైదరాబాద్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల దగ్గర ట్రాన్స్ జెండర్లను విధుల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే నేటి నుంచి 39 మంది ట్రాన్స్‌జెండర్లు నగరంలోని పలు ట్రాఫిక్ జంక్షన్ల దగ్గర విధులు నిర్వహించనున్నారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 15 రోజుల పాటు వీరంతా శిక్షణ పూర్తి చేసుకున్నారు. ట్రాఫిక్ మేనేజ్‌మెంట్‌, ఔట్, ఇండోర్‌తో పాటు పలు టెక్నికల్ అంశాల్లో ఆ 39మంది శిక్షణ పొందారు.

ఈ సందర్భంగా వారందరికీ మద్దతుగా నిలుద్దామని హైదరాబాద్ కమిషనర్ సీపీ ఆనంద్ అన్నారు. ట్రాన్స్ జెండర్లును ట్రాఫిక్ విధులకు నియమించాలని తెలంగాణ ప్రభుత్వం విప్లవాత్మక నిర్ణయం తీసుకుందని, ట్రాన్స్ జెండర్లను సమాజంలోని ప్రజలతో మమేకమయ్యేందుకు మంచి అవకాశం కల్పించిందని చెప్పారు. విధుల్లో చేరబోయే ముందు ట్రాన్స్ జెండర్లనుద్దేశించి సీపీ ఆనంద్ మాట్లాడారు. వారిపై వివక్ష వద్దని, వారిని వేరే విధంగా చూడకుండా వారిని సమాజంలో కలిసిపోయేలా ప్రయ్నతం చేద్దాం అని సీఎం రేవంత్ రెడ్డి అన్న మాటలను గుర్తు చేసుకున్నారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచన, చొరవతోనే ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కిందని అన్నారు.6 నెలల పాటు పైలెట్ ప్రాజెక్టుగా ట్రాన్స్ జెండర్లను ట్రాఫిక్ విధుల్లో నియమించామని చెప్పారు. ట్రాన్స్ జెండర్ కమ్యూనిటీకి ఇదొక సువర్ణావకాశమని, దేశమంతా హైదరాబాద్ వైపు చూస్తోందని అన్నారు.

హైదరాబాద్ లో ఈ విధానం విజయవంతమైతే దేశంలోని ట్రాన్స్ జెండర్లందరికీ మంచి జరుగుతుందని చెప్పారు. ఈ పైలెట్ ప్రాజెక్ట్ విజయవంతం కావాలని, ట్రాన్స్ మెన్, ట్రాన్స్ ఉమన్, ట్రాన్స్ జెండర్లంతా బాధ్యతగా విధులు నిర్వర్తించి తమకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.