అల్లు అర్జున్‌కు పురందేశ్వ‌రి మ‌ద్ద‌తు

పుష్ప‌-2 సినిమా ప్రీమియ‌ర్ షో సంద‌ర్భంగా హైద‌రాబాద్‌లోని సంధ్య ధియేట‌ర్ వ‌ద్ద జ‌రిగిన తొక్కిస‌లాట‌.. ఈ క్ర‌మంలో రేవ‌తి అనే మ‌హిళ మృతి చెంద‌డం.. ఆమె కుమారుడు శ్రీతేజ తీవ్రంగా గాయ‌ప‌డిన ఘ‌ట‌న సంచ‌ల‌నంగా మారిన విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో తెలంగాణ ప్ర‌భుత్వం త‌ర‌ఫున కొంద‌రు నాయ‌కులు చేసిన వ్యాఖ్య‌లు.. ఆ వెంట‌నే శ‌నివారం రాత్రి అల్లు అర్జున్ మీడియా ముందుకు రావ‌డం.. వంటి ప‌రిణామాలు.. ఈ ఘ‌ట‌న‌ను మ‌రింత చ‌ర్చ‌నీయాంశం చేశారు.

ఈ నేప‌థ్యంలో ఏపీ బీజేపీ చీఫ్‌, రాజ‌మండ్రి ఎంపీ పురందేశ్వ‌రి స్పందించారు. అల్లు అర్జున్‌కు బాస‌ట‌గా ఆమె సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. “జ‌రిగిన ఘ‌ట‌న‌లో అల్లు అర్జున్ త‌ప్పు ఎక్క‌డుందో నాకు అర్థం కావడం లేదు” అని పురందేశ్వ‌రి వ్యాఖ్యానించారు. ఆదివారం ప్ర‌కాశం జిల్లాలోని ఆమె నివాసంలో మీడియా తో మాట్లాడిన పురందేశ్వ‌రి.. త‌న సినిమా విడుద‌ల సంద‌ర్భంగా.. వీక్షించేందుకు అల్లు అర్జున్ వెళ్లార‌ని.. దీనిలో త‌ప్పు ఏముందని ప్ర‌శ్నించారు.

అంతేకాదు.. అల్లు అర్జున్ ఈ కేసు ఏ11గా ఉన్నార‌ని.. మొద‌టి 10 మంది నిందితుల‌ను వ‌దిలేసి.. ఏ11గా ఉన్న అర్జున్‌ను అరెస్టు చేయ‌డం వెనుక ఏముందో అర్ధం చేసుకోవ‌చ్చ‌ని న‌ర్మ‌గ‌ర్భంగా వ్యాఖ్యానించారు. ప్ర‌భుత్వాలు ఇలాంటి సున్నిత‌మైన విష‌యాల్లో నేరుగా స్పందించ‌డంపైనా చ‌ర్చ జ‌ర‌గాల‌ని పురందేశ్వ‌రి పేర్కొన్నారు. తొక్కిస‌లాట‌ను అల్లు ఏమైనా ప్రేరిపించారా? అని ఆమె ప్ర‌శ్నించారు.

“ఒక మ‌హిళ‌గా .. రేవ‌తి మృతిని జీర్ణించుకోలేను. కానీ, ఆ ఘ‌ట‌న త‌ర్వాత‌.. జ‌రుగుతున్న ప‌రిణామాలు కూడా అంతే బాధ‌గా ఉన్నాయి. ఈ విష‌యంలో అర్జున్ త‌ప్పేంటి? ఆయ‌న‌ను అంత హ‌డావుడిగా అరెస్టు చేయాల్సి వ‌చ్చిందంటే అర్థం చేసుకోవ‌చ్చు” అని పురందేశ్వ‌రి వ్యాఖ్యానించారు. ఈ విష‌యంలో ప్ర‌భుత్వాలు ఏవైనా కూడా.. సంయ‌మ‌నం పాటిస్తే.. అంద‌రికీ బాగుంటుంద‌ని తేల్చి చెప్పారు.