కొడుకు పేరు మీద రేవతి కుటుంబానికి కోమటిరెడ్డి ఆర్థికసాయం

సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందగా, ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఈ విషాద ఘటనపై తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పందిస్తూ పెద్దమనసు చాటుకున్నారు. ఆయన తన కొడుకు పేరు మీద ఏర్పాటు చేసిన కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి ఫౌండేషన్ తరఫున రేవతి కుటుంబానికి రూ. 25 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు.

కోమటిరెడ్డి కుమారుడు ప్రతీక్ 13 ఏళ్ల క్రితం ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన కారు ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే. ఇక అతని కుమారుడి పేరు మీద ఆయన సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు రేవతి కుటుంబానికి కూడా ఆర్థిక సహాయం అంధించి అండగా ఉంటామని తెలిపారు. అసెంబ్లీ వేదికగా మాట్లాడిన కోమటిరెడ్డి, ఈ ఘటనపై సినీ పరిశ్రమ బాధ్యతగా వ్యవహరించలేదని పేర్కొన్నారు.

ముఖ్యంగా, రేవతి కుటుంబానికి సాయం చేస్తానని మాట ఇచ్చిన అల్లు అర్జున్ తన హామీ నిలబెట్టుకోలేదని విమర్శించారు. ప్రభుత్వానికి చెందిన పలువురు అధికారులు రేవతి కుటుంబాన్ని పరామర్శించినా, సినీ పరిశ్రమ నుంచి తగిన స్పందన రాలేదని తెలిపారు. రేవతి కుమారుడు శ్రీతేజ్ పూర్తిగా కోలుకునే వరకు వైద్య ఖర్చులన్నింటిని తెలంగాణ ప్రభుత్వం భరించనుందని మంత్రి కోమటిరెడ్డి స్పష్టం చేశారు.

ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఈ వ్యయాలను పర్యవేక్షిస్తారని తెలిపారు. గాయపడిన చిన్నారికి అత్యుత్తమ చికిత్స అందించేందుకు కిమ్స్ ఆసుపత్రి వైద్యుల బృందం కృషి చేస్తోందని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, థియేటర్లలో భద్రతా ప్రమాణాలను మరింత కట్టుదిట్టం చేస్తామని కోమటిరెడ్డి హామీ ఇచ్చారు.