వైసీపీలో వివాద‌మ‌వుతున్న యువ ఎంపీ

రాజ‌కీయాల్లో కొంత మంది నేత‌ల శైలి భిన్నంగా ఉంటుంది. వారు ఉన్న‌చోట వివాదాలు.. వివాదాలు ఉన్న చోట వారు ఉండ‌డం ప‌రిపాటిగా మారిపోయింది. ఏ పార్టీ అధికారంలో ఉంటే.. ఆ పార్టీ ఎంపీలు లేదా ఎమ్మెల్యేలు వివాదాల చుట్టూనే కాలం గ‌డుపుతున్నార‌నే వాద‌న వినిపిస్తోంది. గ‌తంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఒకరు నిత్యం వివాదాల‌తోనే పొద్దు పుచ్చేవారు. ఇక‌, ఇప్పుడు వైసీపీ వంతు వ‌చ్చింది. ఈ పార్టీకి చెందిన 21 మంది ఎంపీల్లో(ఒక‌రు మ‌ర‌ణించారు) ఓ న‌లుగురు ఎంపీల‌పై అధిష్టానం దృష్టి పెట్టిన‌ట్టు తెలిసింది. అందులోనూ ఓ యువ ఎంపీపై మ‌రింత‌గా దృష్టి పెట్టిన‌ట్టు స‌మాచారం. మ‌రి ఎందుకు నిఘా పెట్టాల్సి వ‌చ్చింది? ఆయ‌నెవ‌రు? చాలా ఆస‌క్తిగా మారిన ఈ విష‌యంపై వైసీపీలో అంత‌ర్గ‌తంగా జోరుగా చ‌ర్చ జ‌రుగుతుండ‌డం గ‌మ‌నార్హం.

మార్గాని భ‌ర‌త్ .. రాజ‌మండ్రి పార్ల‌మెంటు స్థానం నుంచి అనూహ్య విజ‌యం ద‌క్కించుకున్న యువ నేత‌, సినీ హీరో కూడా! దైవ చింతన కూడా ఎక్కువ‌గా ఉన్న ఈ ఎంపీ.. ఏడాది తిర‌గ‌కుండానే వివాదాల కేంద్రంగా మారార‌ని వైసీపీ నేత‌లు చెబుతున్నారు. సొంత పార్టీ ఎమ్మెల్యేల‌కు, ఆయ‌న‌కు ఏమాత్రం ప‌డ‌డం లేద‌ని కూడా అంటున్నారు. ఇక‌, ప్ర‌చారం ఎక్కువ‌గా ఉంద‌ని.. ఎక్క‌డ ఏ చిన్న కార్య‌క్ర‌మం జ‌రిగినా.. భ‌ర‌త్ అనే నేను అనే పోస్ట‌ర్ వేసుకుంటున్నార‌ని.. ఇది పార్టీలో నేత‌ల మ‌ధ్య విభేదాల‌కు ఆస్కారం ఇస్తోంద‌ని చెబుతున్నారు. ఇక‌, పార్టీ అస‌మ్మ‌తి ఎంపీ ర‌ఘురామ‌కృష్ణ‌రాజుపై ఎవ‌రూ మాట్లాడ‌వ‌ద్ద‌ని చెప్పినా.. భ‌ర‌త్‌.. మాత్రం బ‌హిరంగంగా ఆయ‌న గురించి మాట్లాడుతున్నార‌నేది ప్ర‌ధాన వివాదం.

కాపు కార్పొరేష‌న్ చైర్మ‌న్ దాడిశెట్టి రాజాతో మార్గానికి బ‌హిరంగంగానే వివాదాలు ఉన్నాయ‌నే విష‌యం తెలిసిందే. ఇసుక రీచ్‌లు, త‌వ్వ‌కాల విష‌యం స‌హా అనేక అంశాల్లో ఇద్ద‌రి మ‌ధ్య తీవ్ర వివాదాలు న‌డుస్తూనే ఉన్నాయి. ఇక‌, త‌న పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలో ఏదైనా జ‌రిగితే.. స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలకు ప్రొటోకాల్ మేర‌కు కూడా గౌర‌వం ఇవ్వ‌డం లేద‌నేది మ‌రో కీల‌క ఆరోప‌ణ‌. ఎవ‌రినీ క‌లుపుకొని పోవ‌డం లేద‌ని, తాను సీఎం జ‌గ‌న్‌కు త‌ప్ప ఎవ‌రి మాటా వినేది కూడా లేద‌ని ఆయ‌న నేరుగా చెబుతున్న‌ట్టు స్థానిక నేత‌లు ఆరోపిస్తున్నారు. ఈ ప‌రిణామంతో అభివృద్ధిపై చ‌ర్చించాల‌ని అనుకున్నా.. ఎవ‌రూ ముందుకు రావ‌డం లేద‌ని.. అప్పాయింట్ మెంట్ ఇవ్వ‌డం లేద‌ని నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీ నాయ‌కులు చెబుతున్నారు. ఇక‌, ఈ ప‌రిణామాల‌పై తాజాగా జ‌గ‌న్ దృష్టిపెట్టిన‌ట్టు జిల్లాకు చెందిన కీల‌క నాయ‌కుడు వెల్ల‌డించారు. వ్య‌క్తిగా అవినీతి ర‌హితంగా ఉన్న‌ప్ప‌టికీ.. సొంత పార్టీ నేత‌ల‌పైనే దూకుడు ప్ర‌ద‌ర్శిస్తున్నార‌నే విమ‌ర్శ‌లే మార్గానికి మైన‌స్ మార్కులు ప‌డేలా చేస్తోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.