తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడీవేడిగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఫార్ములా ఈ-కార్ రేస్ వ్యవహారంలో మాజీ మంత్రి కేటీఆర్ పై ఏసీబీ కేసు నమోదు చేయడం, కేటీఆర్ పై ఎఫ్ ఐఆర్ నమోదు కావడం సంచలనం రేపింది. అయితే, సభలో ఆ వ్యవహారంపై చర్చ పెట్టాలని డిమాండ్ చేసిన కేటీఆర్ తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నారు. తనపై నమోదైన కేసును క్వాష్ చేయాలంటే కేటీఆర్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు.
ఆ కేసును క్వాష్ చేయాలంటూ కేటీఆర్ దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్ పై హైకోర్టు ఈ రోజు మధ్యాహ్నం తర్వాత విచారణ జరపనుంది. క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన తర్వాత కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఫార్ములా ఈ-కార్ రేసుకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డికి సమాచార లోపం ఉందని కేటీఆర్ అన్నారు. రేవంత్ రెడ్డిని ఎవరో తప్పుదోవ పట్టిస్తున్నారని చెప్పారు.
తనపై పెట్టిన కేసు నిలబడదని కేటీఆర్ అన్నారు. ఆ రేసులో అవినీతి జరగలేదని మంత్రి పొన్నం అన్నారని, అటువంటపుడు కేసు ఎలా నిలబడుతుందని ప్రశ్నించారు. అయితే, ఆ నిధుల మళ్లింపులో కేటీఆర్ హస్తం ఉందని, ఆర్బీఐ నిబంధనలు ఉల్లంఘించి నిధులు విడుదల చేశారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఏసీబీ అధికారుల విచారణలో మరిన్ని వాస్తవాలు వెలుగులోకి వస్తాయని, రేపో మాపో కేటీఆర్ అరెస్టు ఖాయమని వారు అంటున్నారు.