కేటీఆర్ పై కేసు..అరెస్టు తప్పదా?

బీఆర్ఎస్ హయాంలో ఫార్ములా ఈ-కార్ రేస్ నిర్వహణలో అవకతవకలు జరిగాయని కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వ అనుమతి లేకుండానే హెచ్ఎండీఏకు చెందిన రూ.55 కోట్ల నిధులను విదేశీ కంపెనీలకు మళ్లించారని ఆరోపిస్తున్నారు. ఆనాటి మున్సిపల్ శాఖా మంత్రి కేటీఆర్ కనుసన్నల్లోనే ఈ వ్యవహారం జరిగిందని ఆరోపణలు రావడంతో తాజాగా కేటీఆర్ పై కేసు నమోదైంది.

ఫార్ములా ఈ-కార్ రేసు కేసులో కేటీఆర్ పై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఏ1గా కేటీఆర్, ఏ2గా సీనియర్ ఐఏఎస్‌ అధికారి అరవింద్‌ కుమార్‌, ఏ3గా హెచ్‌ఎండీఏ చీఫ్‌ ఇంజనీర్‌ బీఎల్ఎన్‌ రెడ్డి పేర్లను ఏసీబీ చేర్చింది. 13(1)ఏ, 13(2) పీసీ యాక్ట్ కింద వారిపై కేసులు నమోదయ్యాయి. దాంతోపాటు,120ఏ సెక్షన్ కింద కూడా కేసు నమోదు చేశారు ఏసీబీ అధికారులు. ‘ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్’ యాక్ట్ కింద నమోదైన ఈ కేసుల్లో 3 నాన్ బెయిలబుల్ కేసులున్నాయి.

ఈ కేసు వ్యవహారంపై గవర్నర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు తెలంగాణ ప్రభుత్వం లేఖ రాయడం, ఏసీబీకి మున్సిపల్ శాఖ ఫిర్యాదు చేయడం, ఆనాటి బ్యాంక్ లావాదేవీల నేపథ్యంలో ఏసీబీ కేసు నమోదు చేసింది. పెట్టుబడుల పేరుతో బీఆర్ఎస్ ప్రభుత్వం హుస్సేన్ సాగర్ చుట్టూ ప్రత్యేక ట్రాక్ ఏర్పాటుకు భారీగా ఖర్చు చేసింది. త్వరలోనే కేటీఆర్ ను అరెస్టు చేసే అవకాశాలున్నాయని తెలుస్తోంది.