వైసీపీకి ప్ర‌మోట‌ర్స్ కావ‌లెను… !

ఏపీ ప్రతిప‌క్షం వైసీపీకి ప్ర‌మోట‌ర్స్ కావాలా? పార్టీని ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్లే.. వ్యూహాలు ర‌చించ‌డంతోపాటు.. ప్ర‌జ‌ల‌కు పార్టీని చేరువ చేసేందుకు ప్ర‌మోట‌ర్ల అవ‌స‌రం ఉందా? అంటే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. ప్ర‌స్తుత రాజ‌కీయాల్లో చేయాల్సింది చెప్పుకొంటున్నారు. ఇదేస‌మ‌యంలో చేసింది చెప్పుకోవ‌డం త‌ప్పుకాదు. నిజానికి ప్ర‌మోట‌ర్ల విష‌యంలో సీఎం చంద్ర‌బాబు అతిపెద్ద పొలిటిక‌ల్ ప్ర‌మోట‌ర్‌. ఆయ‌న ఇప్ప‌టికీ త‌న 1995ల నాటి పాల‌న‌ను ప్ర‌మోట్ చేసుకుంటూనే ఉన్నారు.

ఎక్క‌డ అవ‌కాశం వ‌చ్చినా.. కాదు, అవ‌కాశం క‌ల్పించుకుని మ‌రీ చంద్ర‌బాబు త‌న పాల‌న‌ను వివ‌రిస్తారు. ఇది ఆయ‌న‌కు వ‌చ్చిన రాజ‌కీయ చ‌తుర‌త‌. కానీ, ఈ విష‌యంలో వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్ వెనుక‌బ‌డిపోయార‌న్న వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. సొంత పార్టీ నాయ‌కులే.. ఇప్పుడు వైసీపీకి ప్ర‌మోటర్లు కావాలంటూ.. ఫ్లెక్సీలు పెట్టే ప‌రిస్థితి వ‌చ్చింది. పులివెందుల‌లో వైసీపీ నేత‌లు కొన్ని ఫ్లెక్సీల‌ను ఏర్పాటు చేశారు. చేసింది చెప్పుకోవ‌డం చేత‌కావ‌డం లేదు! అనే కామెంట్లు కూడా చేస్తున్నారు.

దీనికి కార‌ణం.. తాజాగా రాజ్య‌స‌భ‌లో కేంద్రం వెల్ల‌డించిన కీల‌క‌మైన జీడీపీ వివ‌రాలే. వైసీపీ హ‌యాంలో జీడీపీ పుంజుకుంద‌ని.. దేశంలోనే ముందు వ‌రుస‌లో నిలిచింద‌ని కేంద్రం చెప్పింది. కానీ.. వైసీపీ కానీ, ఆ పార్టీ సొంత మీడియా కానీ.. దీనిని ప్ర‌చారం చేయ‌డంలో పూర్తిగా వెనుక‌బ‌డ్డారు. ఇక‌, నాయ‌కుల సంగ‌తి చెప్ప‌న‌వ‌స‌ర‌మే లేదు. ఎవ‌రికి వారే య‌మునా తీరే.. అన్న‌ట్టుగా వైసీపీ నాయ‌కులు వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఎవ‌రూ కూడా దూకుడుగా మాట్లాడేవారు.. విష‌యాన్ని వివ‌రించే వారు కూడా క‌నిపించ‌డం లేదు.

పోనీ.. పార్టీ అధినేత అయినా.. చెప్పుకొంటున్నారా? అంటే.. ఏదో మీడియా స‌మావేశ‌లు పెట్టి మ‌మ అని అనిపించుకుంటున్నార‌ని పార్టీలో అంత‌ర్గ‌త చ‌ర్చ సాగుతోంది. ఇదే ప‌రిస్థితి కొన‌సాగితే.. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి కూడా.. వైసీపీపై ప్ర‌జ‌ల‌కు విశ్వాసం పెర‌గ‌ద‌ని స్ప‌ష్టం చేస్తున్నారు. అందుకే.. పార్టీకి ప్ర‌మోట‌ర్లు కావాలంటూ.. సోష‌ల్ మీడియాలోనూ వైసీపీపై కామెంట్లు కురుస్తున్నాయి. మ‌రి ఈ విష‌యాన్ని వైసీపీ అధినేత సీరియ‌స్గా తీసుకుంటారో.. లైట్ తీసుకుంటారో చూడాలి.