‘టీడీపీ త‌లుపులు తెరిస్తే.. వైసీపీ ఖాళీ’

ఏపీలో రాజ‌కీయ వ్యూహాలు, ప్ర‌తివ్యూహాలు ఎలా ఉన్నా.. అధికార పార్టీ నాయ‌కులు చేస్తున్న వ్యాఖ్య‌లు మాత్రం కాక పుట్టిస్తున్నాయి. ఇప్ప‌టికే వైసీపీ నాయ‌కుడు, మాజీ మంత్రి జోగి ర‌మేష్‌.. అధికార పార్టీ నేత‌లు.. మంత్రి కొలుసు పార్థ‌సార‌థి, ఎమ్మెల్యే గౌతు శిరీష‌ల‌తో క‌లిసి పాల్గొన్న కార్య‌క్ర‌మం రాజ‌కీయంగా మంటలు పుట్టించిన విష‌యం తెలిసిందే. దీని నుంచి ఇంకా బ‌య‌ట‌కు రాక‌ముందే.. తాజాగా మ‌రో మంత్రి మండ‌ప‌ల్లి రాంప్ర‌సాద్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. వైసీపీ ఖాళీ అవుతుంద‌ని ఆయ‌న హెచ్చ‌రిక‌లు జారీ చేశారు.

“టీడీపీ త‌లుపు తెరిస్తే.. వైసీపీ ఖాళీ కావ‌డం ఖాయం” అని మంత్రి మండ‌ప‌ల్లి వ్యాఖ్యానించారు. తాజాగా ఓ కార్య‌క్ర‌మంలో మాట్లాడిన మండ‌ప‌ల్లి.. ఎందుకులే అని చంద్ర‌బాబు వేచి చూస్తున్నార‌ని.. కానీ, ఆయ‌న ఓకే అని క‌నుసైగ చేస్తే.. మ‌రుక్ష‌ణం లోనే వైసీపీ నుంచి వ‌ల‌స‌లు గంగా ప్ర‌వాహం మాదిరిగా ఉంటాయ‌ని తెలిపారు. అప్పుడు వైసీపీలో మిగిలేది ఆ న‌లుగురు రెడ్లేన‌ని(జ‌గ‌న్ రెడ్డి, స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి, వి. విజ‌యసాయి రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి) చెప్పుకొచ్చారు. కానీ,తాము అధినేత ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నామ‌ని చెప్పారు.

ఇప్ప‌టికే చాలా మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా.. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్‌తో టచ్‌లో ఉన్నారని తెలిపారు. కానీ, వారు అన్నీ ఆలోచిస్తున్నార‌ని.. ప్ర‌జాస్వామ్య స్పూర్తిని నిల‌బెట్టేందుకు ప్ర‌య‌త్నిస్తున్నార‌ని చెప్పారు. కానీ, వైసీపీ బ‌రితెగించి ప్ర‌భుత్వంపై విమర్శ‌లు చేస్తోంద‌ని.. దీంతో వారు క‌నుక క‌నుసైగ చేస్తే.. త్వరలోనే వైసీపీ ఖాళీ కావడం ఖాయమ‌ని మండ‌ప‌ల్లి చెప్పుకొచ్చారు. ఒకవేళ దేశంలో జ‌మిలి ఎన్నికలు వ‌చ్చినా.. త్వరలోనే ఎన్నిక‌లు జరిగినా వైసీపీ నుంచి పోటీ చేసే వారే ఉండరని మంత్రి రాంప్రసాద్‌రెడ్డి వ్యాఖ్యానించారు.