ఎమ్మెల్యేలకు డ్రంకెన్ డ్రైవ్ టెస్ట్

తెలంగాణ శాసనసభ శీతాకాల సమావేశాలు ఎముకలు కొరికే చలిలో సైతం వాడీవేడిగా కొనసాగుతున్నాయి. పలు అంశాలపై అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ సభ్యుల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అసెంబ్లీకి వచ్చే సభ్యులకు డ్రంకెన్ డ్రైవ్ టెస్ట్ నిర్వహించాలంటూ మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతున్నాయి.

అసెంబ్లీకి వచ్చే ముందు సభ్యులకు డ్రంకెన్ డ్రైవ్ టెస్టులు నిర్వహించాలని హరీష్ రావు సభలో వ్యాఖ్యానించడం దుమారం రేపింది .కొందరు సభ్యులు డ్రింక్ చేసి సభకు వస్తున్నారని, సభలోకి వచ్చి ఏం మాట్లాడుతున్నారో వారికి తెలియడం లేదని హరీష్ రావు ఆరోపించారు. అందుకే రోడ్లపై డ్రంకెన్ డ్రైవ్ టెస్ట్ పెట్టినట్లుగా అసెంబ్లీ గేటు బయట కూడా నిర్వహించాలని హరీష్ రావు సూచించారు.

హరీష్ రావు వ్యాఖ్యలకు కాంగ్రెస్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య కౌంటర్ ఇచ్చారు. ప్రతిపక్ష నేత కేసీఆర్ ను ఉద్దేశించి హరీష్ రావు మాట్లాడుతున్నారని, ఆయన తాగి సభకు రాకుండా ఫాం హౌస్ లో పడుకున్నాడనీ, బాత్ రూమ్ లో కూడా అలానే పడ్డాడేమో అని సెటైర్లు వేశారు.

హరీష్ రావు పై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన ఆరోపణ చేశారు. మామ చాటు అల్లుడు హరీష్ రావు అని, గత ప్రభుత్వ హయాంలో 10వేల కోట్ల రూపాయలు దోచుకున్న దొంగ అని ఆరోపించారు. తన రాజకీయ జీవితంలో ఏనాడు అవినీతికి పాల్పడలేదని కోమటిరెడ్డి అన్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కమీషన్ లిస్టు తన దగ్గర ఉందని, అది చదవమంటే చదువుతానని హరీష్ రావు…కోమటిరెడ్డికి కౌంటర్ ఇచ్చారు.

అయితే, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సభలో మాట్లాడుతూ కాస్త తడబడ్డారు. దీంతో, కోమటిరెడ్డిని ఉద్దేశించి హరీష్ రావు పరోక్షంగా డ్రంకెన్ డ్రైవ్ వ్యాఖ్యలు చేశారని సోషల్ మీడియాలో కొందరు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఏది ఏమైనా శాసన సభ్యులకు డ్రంకెన్ డ్రైవ్ టెస్ట్ అంటూ హరీష్ రావు చేసిన కామెంట్టు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.