తెలంగాణ అసెంబ్లీలో విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంటు వ్యవహారం కాక రేపింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో విద్యార్థులకు చెల్లించాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంటును ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ చెల్లించడం లేదని ఎంఐఎం సభ్యుడు అక్బరుద్దీన్ ఒవైసీ నిలదీశారు. విద్యార్థులపై రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలోనూ అప్పటి ప్రభుత్వం బకాయిలు పెట్టిందని తెలిపారు. వేల కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయని చెప్పారు.
అయితే.. తర్వాత అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఉమ్మడి రాష్ట్రంలో పెట్టిన బకాయిలను చెల్లించారని అక్బరుద్దీన్ తెలిపారు. ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా కొన్ని బకాయిలు పెట్టిందని.. వీటిని చెల్లించాల్సిన బాధ్యత ప్రజా ప్రభుత్వంగా కాంగ్రెస్‌పై ఉందన్నారు. తక్షణమే ఫీజు రీయింబర్స్ మెంటు బకాయిలు చెల్లించాలని అక్బరుద్దీన్ డిమాండ్ చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంటు విడుదల చేయకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయన్నారు.
తానే స్వయగా రోడ్డెక్కి నిరసనలు తెలుపుతానని చెప్పారు. ప్రజలకు సుపరిపాలనను అందిస్తానని చెబుతున్న ముఖ్యమంత్రి, మంత్రులు.. విద్యార్థుల ఫీజులు ఎగ్గొట్టి రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. ఇది సరైన విధానం కాదన్నారు. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకోవాలని ఆయన కోరారు. విద్యార్థులకు రాజకీయాలు అంటగట్టడం సరికాదని హెచ్చరించారు. దీనిపై తాము ఉద్యమాలకు రెడీ అవుతున్నట్టు పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో విద్యార్థులతో కలిసి నిరసన తెలుపుతామని పేర్కొన్నారు.