కూటమి ప్రభుత్వంలో మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు నివేదిక రెడీ చేసుకున్నారని సమాచారం. సచివాలయంలో ఏ శాఖ ఉన్నతాధికారిని కలిసినా.. నివేదిక రెడీ అయిందనే చెబుతున్నారు. వాస్తవానికి రాష్ట్రంలో కూటమి సర్కారు ఏర్పడిన తర్వాత.. 100 రోజుల్లోనే మంత్రులకు సంబంధించిన నివేదికను విడుదల చేస్తామని.. మంత్రుల పనితీరుపై మధనం చేస్తామని అప్పట్లో చంద్రబాబు చెప్పారు. అయితే.. 100 రోజుల సమయంపై మంత్రులు ఒకింత ఆవేదన వ్యక్తం చేశారు.
వ్యవస్థలు కుప్పకూలాయని మీరే చెబుతున్నారు.. ఇప్పుడు వాటిని సరిదిద్దేందుకు తమకు కూడా సమయం ఇవ్వాలని వారు అభ్యర్థించారు. ఈ క్రమంలోనే చంద్రబాబు.. 6 మాసాల గడువు ఇచ్చారు. ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో మరోసారి ప్రోగ్రెస్ రిపోర్టుపై చర్చ సాగింది. దీనిపై పలువురు మంత్రులకు చంద్రబాబు సూచనలు కూడా చేశారు. ఎట్టి పరిస్థితిలోనూ ప్రోగ్రెస్ రిపోర్టును విడుదల చేయాల్సిందేనని ఆయన తేల్చి చెప్పారు. దీనికి సంబంధించి గడువు కూడా విధించారు.
ఈ క్రమంలోనే తాజాగా మంత్రుల పనితీరుపై నివేదిక రెడీ అయిందని సమాచారం. దీనిలో మంత్రులు నారా లోకేష్, గొట్టిపాటి రవికుమార్, డోలా బాల వీరాంజనేయస్వామి, నారాయణలు ముందు జాబితాలో ఉండగా.. తర్వాత వరుసలో కొలుసు పార్థసారథి, బీసీ జనార్దన్‌రెడ్డి, మండపల్లి రాంప్రసాద్‌రెడ్డి ఉన్నట్టు తెలిసింది. ఇక, పెద్దగా ఫోకస్ చేయని శాఖలుగా.. కూడా కొన్ని ఉన్నాయని తెలుస్తోంది. వీటిలో కార్మిక శాక ముందు వరుసలో ఉన్నట్టు సమాచారం.
ఇటీవల కాలంలో మంత్రి సుభాష్ అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో సహజంగానే ఆయన చివరి వరుసలో ఉంటారని అందరూ అనుకున్నారు. కానీ, ఆయన కన్నావెనుక బడిన ఓ మంత్రి ఉన్నారని.. ఆయన సీనియర్ నాయకుడు, గతంలోనూ మంత్రిపదవిని అలంకరించారని చెబుతున్నారు. ఇక, మహిళా మంత్రుల్లో సవిత దూకుడుగా ఉన్నట్టు ముఖ్యమంత్రి భావిస్తున్నారు. దీంతో మహిళా మంత్రుల్లో ముగ్గురిలో సవిత తొలిజాబితాలో ఉండడం గమనార్హం. ఈ నివేదికను సంక్రాంతికి ముందే విడుదల చేయనున్నట్టు పార్టీ వర్గాలు కూడా చెబుతున్నాయి.