అల్లు అర్జున్ అరెస్టును ఖండించిన జగన్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్టు వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ కు నాంపల్లి కోర్టు 2 వారాల పాటు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. దీంతో, ఆయనను చంచల్ గూడ జైలుకు తరలిస్తున్నారు. మరోవైపు, తనపై నమోదైన ఎఫ్ఐఆర్ క్వాష్ చేయాలంటూ అల్లు అర్జున్ తెలంగాణ హైకోర్టులో దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై వాదనలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ అరెస్టుపై ఏపీ మాజీ సీఎం జగన్ స్పందించారు.

అల్లు అర్జున్ అరెస్టును జగన్ ఖండించారు. సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాట ఘటనలో మహిళ మరణించడం బాధాకరమని, ఆమెను తిరిగి తీసుకురాలేమని అన్నారు. ఆ అభిమాని మృతిపై అల్లు అర్జున్ తన విచారం వ్యక్తం చేశారని, ఆ కుటుంబానికి అండగా ఉంటానని భరోసానిచ్చారని జగన్ చెప్పారు. అల్లు అర్జున్ బాధ్యతాయుతంగా వ్యవహరించారని, అయినప్పటికీ ఈ ఘటనకు ఆయనను నేరుగా బాధ్యుడిని చేయడం సరికాదని అభిప్రాయపడ్డారు. ఈ ఘటనలలో అల్లు అర్జున్ ప్రమేయం లేనప్పటికీ క్రిమినల్ కేసులు బనాయించి అరెస్టు చేయడం సమంజసం కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

మరోవైపు, తెలంగాణ హైకోర్టులో క్వాష్ పిటిషన్ పై అల్లు అర్జున్ తరఫు లాయర్లు, ప్రభుత్వం, పోలీసుల తరఫు లాయర్లు వాడీవేడీ వాదనలు వినిపిస్తున్నారు. 2017లో రాయీస్ చిత్రం ప్రమోషన్ సందర్భంగా బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ పై కూడా ఈ తరహా కేసు నమోదైందని, అప్పుడు షారుఖ్ ఖాన్ ను నేరస్తుడిగా కోర్టు పరిగణించలేదని అల్లు అర్జున్ తరఫు లాయర్ నిరంజన్ రెడ్డి వాదిస్తున్నారు.