క‌లెక్ట‌ర్ల స‌ద‌స్సులో న‌వ్వులు పూయించిన చంద్ర‌బాబు

ఏపీలో రెండు రోజులు జ‌రిగిన క‌లెక్ట‌ర్ల స‌ద‌స్సులో చివ‌రి రోజు సీఎం చంద్ర‌బాబు అంద‌రినీ న‌వ్వుల్లో ముంచెత్తారు. ఆయ‌న చేసిన వ్యాఖ్య‌ల‌తో అప్ప‌టి వ‌ర‌కు సీరియ‌స్‌గా ఉన్న కలెక్ట‌ర్లు ఒక్క‌సారిగా న‌వ్వుల్లో మునిగిపోయారు. నిజానికి ఇలాంటి సీరియ‌స్ స‌ద‌స్సుల్లో సీఎం చంద్ర‌బాబు కూడా అంతే సీరియ‌స్ గా ఉంటారు. అలాంటి బాబు.. అంద‌రినీ న‌వ్వించ‌డం గ‌మ‌నార్హం. క‌లెక్ట‌ర్ల స‌ద‌స్సులో అనేక అంశాలు చ‌ర్చ కు వ‌చ్చాయి. పాల‌న‌పై ప్ర‌జ‌ల నుంచి అభిప్రాయాలు తీసుకోవాల‌ని సీఎం చంద్ర‌బాబు సూచించారు.

ఈ నేప‌థ్యంలోనే లిక్క‌ర్ వ్య‌వ‌హారం కూడా చ‌ర్చ‌కు వ‌చ్చింది. లిక్క‌ర్ విక్ర‌యాల‌కు సంబంధించి ఐవీఆర్ఎస్ ద్వారా అభిప్రాయాలు తీసుకుంటామ‌ని చంద్ర‌బాబు చెప్పారు. ముఖ్యంగా డిజిట‌ల్ పేమెంట్ల‌పై ఐవీఆర్ ఎస్ ద్వారా ప్ర‌జ‌ల నుంచి స‌మాచారం సేక‌రిస్తామ‌న్నారు. అయితే.. దీనిపై ఎక్సైజ్ శాఖ కార్య‌దర్శి మీనా అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. తాగిన త‌ర్వాత‌.. వారి నుంచి అభిప్రాయం సేక‌రించ‌డం స‌రికాదే మోన‌ని చెప్పుకొచ్చారు. మ‌ద్యం తాగిన వారు స‌రైన స‌మాచారం చెప్ప‌బోర‌ని అన్నారు.

అయితే.. ఈసంద‌ర్భంగా ముఖ్య‌మంత్రి జోక్యం చేసుకుని.. తాగిన వారే క‌రెక్టుగా చెబుతార‌ని వ్యాఖ్యానిం చారు.గ‌త ప్ర‌భుత్వంలో కూడా తాగిన వారే స‌రైన స‌మాచారం ఇచ్చార‌ని, బూతులు కూడా తిట్టార‌ని చెప్పుకొచ్చారు. కాబ‌ట్టి తాగుబోతుల నుంచి స‌మాచారం సేక‌రించ‌డం స‌రైందేన‌ని అన్నారు. దీంతో ఒక్క‌సారిగా క‌లెక్ట‌ర్ల స‌ద‌స్సు న‌వ్వుల‌తో నిండిపోయింది.

ఇదేస‌మ‌యంలో మీరు స‌రైన స‌మాచారం ఇవ్వ‌క పోబ‌ట్టే ఐవీఆర్ఎస్ ద్వారా ప్ర‌జ‌ల నుంచి స‌మాచారం తెప్పించుకుంటున్నామ‌ని చంద్ర‌బాబు చెప్ప‌డం గ‌మ‌నార్హం. మొత్తానికి లిక్క‌ర్ పాల‌సీ.. విక్ర‌యాలు, బెల్టు షాపులు, ధ‌ర‌లు వంటి వాటిపైనా స‌ర్కారు ఎప్ప‌టికప్పుడు ప్ర‌జ‌ల నుంచి స‌మాచారం సేక‌రించేందుకు సిద్ధ‌మైంది. మ‌రి ఏమేరకు అక్ర‌మాలు త‌గ్గుతాయో చూడాలి.