వైసీపీ సీనియర్ నాయకుడు, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణకు సొంత పార్టీలోనే సెగలు పుడుతున్నాయి. ఉభయ గోదావరి జిల్లాలకు ఆయన వైసీపీ ఇంచార్జ్‌గా ఉన్న విషయం తెలిసిందే. ఇక్కడి నాయకులను లైన్‌లో పెట్టడం.. వివాదాలకు దారి లేకుండా వ్యవహరించడం.. పార్టీ నుంచి బయటకు వెళ్లిపోయేవారిని కట్టడి చేయడం ఇప్పుడు బొత్సకు ఉన్నప్రధాన బాధ్యత. అయితే.. ఈ బాధ్యతల మాట ఎలా ఉన్నా.. స్థానికంగా ఉన్న నాయకుల వ్యవహార శైలి మాత్రం బొత్సకు భారంగా ఉంది. రెండు రోజుల కిందట సమన్వయ సమావేశం నిర్వహించారు.
ఈ నెల 13న రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నేతలు నిర్వహించ తలపెట్టిన.. నిరసనల్లో అందరూ పాల్గొనాలని ఆయన సూచించారు. ఈ క్రమంలో అందరూ పాల్గొనేలా వారిని దిశానిర్దేశం చేసేందుకు ఆయా జిల్లాల ఇంచార్జ్‌లు ప్రయత్నిస్తున్నారు. దీనిలో భాగంగానే బొత్స ఉభయ గోదావరి జిల్లాల నాయకులతో భేటీ అయ్యారు. కూటమి సర్కారు అవలంభిస్తున్న విధానాలు ఆయన వివరించారు. ప్రభుత్వం పై పోరాడేందుకు.. అందరూ కలసి కట్టుగా రావాలని పిలుపునిచ్చారు. ఇంత వరకు బాగానే ఉంది. కానీ, ఈ సమావేశంలోనే ద్వితీయ శ్రేణి నాయకులు నిప్పులు చెరిగారు.
ఎన్నికలకు ముందు.. తమ నుంచి తీసుకున్న సొమ్ములను తిరిగి ఇప్పించాలని వారు కోరడం అందరినీ విస్మయానికి గురి చేసింది. ఎమ్మెల్యేలుగా పోటీ చేసిన వైసీపీ నాయకులు మండలస్థాయిలో ఖర్చులను స్థానిక నాయకులపై పెట్టారు. ముందు మీరు ఖర్చు పెట్టండి తర్వాత ఇస్తామన్నారు. కానీ, వారు ఓడిపోవడంతో అందరూ మొహం చాటేస్తున్నారు. ఒకరిద్దరు నాయకులు మాత్రమే అంతో ఇంతో ఇచ్చి చేతులు దులుపుకొన్నారు. తర్వాత చూద్దామని నచ్చజెప్పారు. కానీ, మిగిలిన వారు మాత్రం అసలు ద్వితీయ శ్రేణి నాయకులకు దూరంగా ఉంటున్నారు.
ఈ విషయాన్ని తాజాగా ప్రస్తావించిన నాయకులు ముందు తమ సొమ్ముల సంగతి తేల్చాలని నిలదీశారు. దీనికి బొత్స నివ్వెర పోయారు. ఈ సమస్యను తాను త్వరలోనే పరిష్కరిస్తానన్నారు. మరోవైపు తూర్పుగోదావరికి చెందిన మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఒకరు ఈ సమావేశానికి డుమ్మా కొట్టారు. ఆయన కుమారుడు ఓ కేసులో ఇరుక్కున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో పార్టీ పరంగా తనకు ఎలాంటి మద్దతు లభించలేదని.. ఆయన అప్పట్లోనే ఆరోపించారు. ఇక, అప్పటి నుంచి పార్టీకి దూరంగా ఉన్నారు. తాజాగా నిర్వహించిన సమావేశానికి కూడా ఆయన హాజరు కాలేదు.
దీంతో బొత్స ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేసినా.. ఫలించలేదు. దీంతో ముక్తసరిగా మాట్లాడి ముగించారు. ఈ పరిణామాలతో బొత్స తర్జన భర్జన పడుతున్నారు. ఇదే పరిస్థితి మున్ముందు కూడా కొనసాగితే.. సరిదిద్దడం కష్టమనే భావన ఆయనలో కనిపిస్తోంది. మరి ఏం చేస్తారో చూడాలి. పైగా.. గోదావరి జిల్లాల నాయకుల వ్యూహాలకు.. బొత్స ఆలోచనలకు సరిపోయే పరిస్థితి లేదన్న చర్చ కూడా నడుస్తోంది.