బీహార్ లో ఆర్జేడీకి ఊహించని దెబ్బ

బీహార్ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపధ్యంలో ఆర్జేడీకి ఊహించని దెబ్బ పడింది. బీహార్ మాజీ, ముఖ్యమంత్రి, పార్టీ వ్యవస్ధాపకుడు లాలూ ప్రసాదయాదవ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనే అవకావాలు లేవని తేలిపోయింది. పశుదాణా కేసులో ప్రస్తుతం జైలుశిక్ష అనుభవిస్తున్న లాలూకు కోర్టు బెయిల్ ఇచ్చింది. ఇంకేముంది ఒకటి రెండు రోజుల్లో బయటకు వచ్చేస్తారని అందరు అనుకున్నారు. ఆర్జేడీకి ప్రస్తుత ఎన్నికల్లో గెలవటం చాలా అవసరం. లాలూ తరపున ఆయన కొడుకు తేజస్వీ యాదవే అన్నీ వ్యవహారాలను చూసుకుంటున్నారు. 243 అసెంబ్లీ సీట్లున్న రాష్ట్రంలో ఈ పార్టీ 143 సీట్లలో పోటి చేస్తోంది. మరో 70 సీట్లకు కాంగ్రెస్ పోటి చేస్తుంటే మిగిలిన సీట్లలో చిన్నా చితకా భాగస్వామ్య పార్టీలు పోటి చేస్తున్నాయి.

విషయం ఏమిటంటే ఈ ఎన్నికలు ఇటు ఎన్డీఏ కూటమికి అటు యూపీఏ కూటమికి రెండింటికి చాలా కీలకమే. రెండు కూటముల్లోను మైనసులున్నాయి, ప్లస్సులున్నాయి. కాకపోతే ఎన్డీఏ కూటమి తరపున ఎన్నికల ప్రచారంలో ప్రధానమంత్రి నరేంద్రమోడి, అమిత్ షా పాల్గొంటారు. ఎన్నికల వ్యూహాలను అమిత్ తెర వెనుక నుండి నడిపిస్తారు. ఇదే సమయంలో యూపీఏ కూటమి తరపున ప్రచారానికి కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధి వస్తారో లేదో తెలీదు. ఇదే సమయంలో రాహూల్ గాంధి, ప్రియాంకా గాంధి రావటం ఖాయమైంది. సరే మోడి, అమిత్ , రాహూల్, ప్రియాంకా ఇలా ఎంతమంది వచ్చిన అందరు బయటవాళ్ళే అన్నది మరచిపోకూడదు.

కానీ లోకల్ అనే ట్యాగ్ ఉన్న వాళ్ళల్లో ఓటర్లను ప్రభావితం చేయగలిగే నేతలు మాత్రం కొద్ది మందే ఉన్నారు. అటువంటి వాళ్ళల్లో లాలూ ప్రసాద్ యాదవ్ చాలా ఇంపార్టెంట్. ఇంతటి ప్రాధాన్యత ఉన్న లాలూ బెయిల్ పై బయటకు వచ్చేయటం, ఎన్నికల ప్రచారంలో పాల్గొని చక్రం తిప్పటం ఖాయమనే అందరు అనుకున్నారు. దానికి తగ్గట్లే కోర్టు కూడా బెయిల్ ఇచ్చింది. ఇంకేముంది లాలూ వచ్చేయటం ఖాయమే అనుకుంటున్న సమయంలో ఊహించని రితిలో బ్రేకులు పడ్డాయి. ట్రెజరిని మోసం చేసి రూ. 3.3 కోట్లను కాజేసిన కేసు కూడా లాలూపై మరో కేసుంది. ఈ కేసులో కూడా శిక్షపడింది.

అంటే రెండు కేసుల్లో పడిన శిక్షల్లో ఒకదానికి బెయిల్ వచ్చినా మరో కేసు శిక్ష విషయంలో లాలూకు బెయిల్ దొరకలేదు. ఎన్నికల్లోపు బెయిల్ దొరికే అవకాశం కూడా లేదని సమాచారం. ఈ పరిణామాన్ని ఆర్జేడీ ఏమాత్రం ఊహించలేదు. గడచిన 40 ఏళ్ళల్లో అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారానికి లాలూ దూరంగా ఉండటం ఇదే మొదటిసారి. ఆ మధ్య జరిగిన లోక్ సభ ఎన్నికల్లో కూడా లాలూ ప్రచారం చేయలేదు. ఇక లాలూ బయటకు వచ్చే అవకాశం లేదని తేలిపోవటంతో ప్రత్యామ్నాయంగా ప్రచార బాధ్యతలు ఎవరికి అప్పగించాలనే విషయంపై చర్చలు మొదలయ్యాయి. బహుశా లాలూ సతీమణి, మాజీ ముఖ్యమంత్రి రబ్రీదేవిని రంగంలోకి దింపుతారేమో చూడాలి.