తన పరువుకు భంగం కలిగిందని పేర్కొంటూ.. వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్.. ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రముఖ పారిశ్రామిక వేత్త గౌతం అదానీ నుంచి జగన్ రూ.1750 కోట్ల మేరకు లంచాలు తీసుకున్నారంటూ.. రెండు ప్రధాన పత్రికలు రాసిన వార్తలను ఖండిస్తూ.. ఈ పిటిసన్‌ను ఆయన దాఖలు చేశారు. దీనిని విచారణకు స్వీకరించిన ఢిల్లీ హైకోర్టు ఆయా పత్రికలకు నోటీసులు జారీ చేసింది. ఇదేసమయంలో గూగుల్ సంస్థపైనా జగన్ పిటిషన్ వేశారు.
అయితే.. ఈ పిటిషన్లపై ఏం జరుగుతుందనేది పక్కన పెడితే.. రెండు కీలక విషయాలు చర్చకు వస్తున్నాయి. 1) ఏపీ మాజీ సీఎం ఇక్కడి కోర్టులను ఆశ్రయించకుండా.. ఢిల్లీలో ఉన్న కోర్టులో పిటిషన్ వేయడం. 2) మీడియాపై పరువునష్టం కేసు వేయడం. ఈ రెండు అంశాలు కూడా ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చ కు వస్తున్నాయి. మొదటి విషయాన్ని తీసుకుంటే.. వాస్తవానికి ఏపీ పత్రికలు రాసినప్పుడు.. కేసులు వేయాలని అనుకుంటే.. ఏపీ కోర్టుల్లోనే వేయాలి. కానీ, జగన్.. దీనికి విరుద్ధంగా వ్యవహరించారు.
అంటే.. దీనిని బట్టి జగన్‌కు ఏపీ హైకోర్టుపై నమ్మకం లేదని భావించాల్సి వస్తోందని న్యాయనిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇదేసమయంలో తనపై జరుగుతున్న ప్రచారానికి గూగుల్ కూడా.. సహకరిస్తోందన్న ఆవేదనతో ఉన్న జగన్.. గూగుల్ వంటి సంస్థలపై కేసులు వేయడం కూడా చర్చగా మారింది. ఈ క్రమంలోనే ఆయన ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారన్నది ఒక వైపు వాదన. కానీ, ఇలా చేయడం ద్వారా.. ఏపీలో ఉన్న ఏపీ న్యాయవ్యవస్థను నమ్మడం లేదన్న చర్చ రాజకీయంగా ఆయనకు ఇబ్బందిగా మారే అవకాశం ఉంది.
ఇక, రెండో అంశం.. పత్రికలపైపరువు నష్టం కేసు. ఇలా వేయడం కొత్త కాకపోయినా.. ఏపీలో మాత్రం ఇదే తొలిసారి. గతంలో వైఎస్‌రాజశేఖరరెడ్డి కేంద్రంగా కూడా.. ఈ రెండు పత్రికలు అనేక కథనాలు రాశాయి. అయినప్పటికీ.. ఆయన సంయమనం పాటించి ప్రజల మధ్యకు వచ్చారు. ఇప్పుడు ప్రజల మధ్యకు వచ్చి వివరణ ఇచ్చుకునే పరిస్థితిలో జగన్ లేరన్న భావన వ్యక్తమవుతోంది. జరగాల్సిన నష్టం జరిగిపోయిన తర్వాత.. తాపీగా కోర్టును ఆశ్రయించినా.. ప్రయోజనం దక్కడం కష్టమేనని అంటున్నారు పరిశీలకులు. మరి ఏం చేస్తారో చూడాలి.