కొంచెం ఇష్టం.. కొంచెం క‌ష్టం.. ఈ ఎమ్మెల్యేలింతే .. !

వైసీపీ ఎమ్మెల్యేల వ్య‌వ‌హారం మ‌రోసారి చ‌ర్చ‌కు దారి తీసింది. కొంద‌రు ఎమ్మెల్యేల‌కు స‌భ‌కు వెళ్లాల‌ని.. మ‌రికొంద‌రు జ‌గ‌న్ చెప్పింది వినాల‌ని.. ఇలా రెండు వ‌ర్గాలుగా నాయ‌కులు చీలిపోయారు. ప్ర‌దానంగా కొంద‌రు స‌భ‌కు వెళ్లాల‌ని చూస్తున్నారు. అయితే.. పార్టీ అధిష్టానం ఆదేశాల‌ను ధిక్క‌రించిన వార‌మ‌వుతామ‌న్న ఆలోచ‌న వారిలో క‌నిపిస్తోంది. దీంతో అసెంబ్లీకి వ‌స్తున్నా.. స‌భ‌కు వెళ్ల‌కుండా.. బ‌య‌టే ఉండి పోతున్నారు. ఇద్ద‌రు ముగ్గురు ఎమ్మెల్యేలు.. మీడియాతో మాట్లాడి సంతృప్తి చెందుతున్నారు.

ఇక‌, మిగిలిన మ‌రో ఐదారుగురు పార్టీ ఆదేశాల‌కు అనుగుణంగా.. స‌భ‌కు దూరంగా ఉంటున్నారు. కానీ, వారి లోనూ స‌భ‌కు రావాల‌న్న త‌హ‌త‌హ క‌నిపిస్తోంది. దీంతో తమ జిల్లా గురించి.. స‌భ‌లో ప్ర‌శ్నించే అవ‌కాశం కోసం ఎదురు చూస్తున్నారు. గ‌తంలో స‌భ‌కు రాక‌పోయినా.. రాత పూర్వ‌క ప్ర‌శ్న‌లు సంధించే అవ‌కాశం ఉండేది. అయితే.. స్పీక‌ర్ అయ్య‌న్న పాత్రుడు.. ప్ర‌స్తుత బడ్జెట్ స‌మావేశాల్లో ఈ త‌ర‌హా అవ‌కాశాన్ని ప‌క్క‌న పెట్టారు.

ప్ర‌శ్న‌లు అడ‌గాల‌ని అనుకున్న వారు.. స‌భ‌కు హాజ‌రు కావాల‌ని.. మంత్రులు స‌మాధానం చెబుతున్న‌ప్పుడు.. స‌భ‌లో ఉండాల‌ని నిర్దేశించారు. దీంతో స‌భ‌కు రాని వైసీపీ ఎమ్మెల్యేలు ఇప్పుడు ప్ర‌శ్న‌లు సంధించే అవ‌కాశం కోల్పోయారు. ఇదిలావుంటే.. స‌భ‌కు రావాల‌నికోరుకుంటున్న వారిని ప‌రిశీలిస్తే..రెండు కార‌ణా లు క‌నిపిస్తున్నాయి.

1) నియోజ‌క‌వ‌ర్గంలో స‌మ‌స్య‌లు పెరుగుతుండ‌డం. తాము ప‌ట్టించుకోవాలంటూ.. పెద్ద ఎత్తున నియోజ‌క‌వ‌ర్గంలో డిమాండ్లు వ‌స్తున్నాయి. దీంతో వారిపై ఒత్త‌డి పెరుగుతోంది.

2) ప్ర‌జ‌ల్లో సానుభూతి లేక‌పోవ‌డం.: స‌హ‌జంగా స‌భ‌కు హాజ‌రై త‌మ త‌ర‌ఫున ప్ర‌శ్నించే వారిని ప్ర‌జ‌లు గుర్తు పెట్టుకుంటారు. కానీ, జ‌గ‌న్ కోసం.. ఎమ్మెల్యేలు స‌భ‌కు హాజ‌రు కాకుండా ఉండిపోవ‌డంతో వారిపై సింప‌తీ పెర‌గ‌క‌పోగా.. కూట‌మి నాయ‌కులు చేస్తున్న ప్ర‌చారాన్ని తిప్పికొట్ట‌లేని ప‌రిస్థితి ఏర్ప‌డింది. దీంతో ఎలాగోలా స‌భ‌కు హాజరు కావాల‌ని భావిస్తున్నారు. మ‌రో 10 రోజుల‌కు పైగానే స‌భ జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో స‌భ‌లోప‌లికి రాక‌పోయినా.. మీడియా ముందైనా క‌నిపించేందుకు కొంద‌రు ఉత్సాహ ప‌డుతున్నారు.