వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌లో మార్పు రావాలంటూ.. పెద్ద ఎత్తున సొంత పార్టీ నాయకులే కోరుకుంటున్నారు. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు అనేక మంది నాయకులు బయటకు చెబుతున్న, అంతర్గతంగా వ్యాఖ్యానిస్తున్న విషయం కూడా.. ఇదే! జగన్ మారాలి.. మా పార్టీ మారాలి! అనే!! కానీ, జగన్ మాత్రం మారడం లేదు. తనకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదని అసెంబ్లీని బాయ్ కాట్ చేశారు. తను నవరత్నాలు ఇచ్చి.. ప్రజలకు మేలు చేసినా.. తనకు ఓట్లేయలేదని.. ప్రజా సమస్యలను కూడా వదిలేశారు.
ఇక,తనపై విమర్శలు చేస్తున్నారంటూ.. సొంత సోదరి షర్మిల, తల్లి విజయమ్మలను కూడా వదులుకున్నారు. తాను వదులుకున్నవే కాకుండా.. తనను వదులుకున్న వారిని కూడా జగన్ పట్టించుకోవడం లేదు. అయితే.. ఈ అన్ని అంశాలకూ కారణం.. జగన్ ఒంటెత్తు పోకడలేనని అంటున్నారు సొంత నాయకులు. ఇక, సాధారణ ప్రజానీకంలోనూ ఇలాంటి చర్చే జరుగుతోంది. ఇక, విపక్షాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏముంటుంది.? అంటే.. మొత్తంగా జగన్ తన పంథాను మార్చుకోవాల్సి ఉంది.
అందరూ కోరుతున్నది జగన్ లో మార్పు అయితే.. జగన్ మాత్రం.. ఈ సమస్యలన్నింటికీ.. తన తాడేపల్లి ప్యాలెస్సే కారణమని భావిస్తున్నారట. అంటే వాస్తు లోపాలు! ఆశ్చర్యంగా ఉన్నా.. నిజం. నిత్యం బైబిల్ చదివే జగన్ హిందూ వాస్తును నమ్మడమేంటనే సందేహం కూడా రావొచ్చు. కానీ, ఇది నిజమేనని చెబుతున్నారు పరిశీలకులు. తాజాగా తాడేపల్లి ప్యాలెస్‌లో వాస్తు మార్పులు జోరుగా సాగుతున్నాయని తెలిసింది. హైదరాబాద్‌కు చెందిన ఓ ప్రముఖ జ్యోతిష్యుడు, వాస్తు సిద్ధాంతి సూచనల మేరకు ఇలా చేస్తున్నారని వైసీపీ ముఖ్య నేతలు చెబుతున్నారు.
ఏం మార్పులు చేస్తున్నారు?
- తన అధికారం పోవడానికి కారణమని భావిస్తున్న నైరుతి మూల పల్లం తగ్గించి.. హైట్ లేపుతున్నారు.
- పశ్చిమ ఎంట్రన్స్‌ను పూర్తిగా మూసివేయించనున్నారు. నాయకులు ఎవరు వచ్చినా.. ఈ మార్గం నుంచే లోపలికి ప్రవేశించేవారు. ఇప్పుడుదీనిని మూసివేసి.. ప్రత్యామ్నాయంగా ఉత్తరం వైపు పెద్ద గేటును నిలబెట్టనున్నారు.
- పార్టీలో అంతర్గత కుమ్ములాటలకు, కుటుంబ సభ్యులతో వివాదాలకు కారణం.. వాయువ్య భాగం దెబ్బతినడమేనని సిద్ధాంతులు చెప్పారట. ప్రస్తుతం ఇక్కడ ఉన్న పార్కింగ్‌ను మార్చి.. దానిని సరిచేయడం ద్వారా పార్టీ సహా.. కుటుంబ వివాదాలు సమసి పోతాయని లెక్కలు వేసుకుంటున్నారు.
- ఇక, కీలకమైన తూర్పులో మెరక ఎక్కువగా ఉండడంతో ఇక్కడ కూడా మార్పులు చేసి.. పల్లం చేయనున్నారు. మొత్తానికి ఈ వాస్తు మార్పులు బాగానే ఉన్నా.. అసలు మారాల్సింది.. జగనే కదా! అంటున్నారు నెటిజన్లు.