రాజకీయాల్లో వ్యూహ ప్రతివ్యూహాలు మారుతుంటాయి. ఎప్పటికప్పుడు పైచేయి సాధించేందుకు ప్రత్యర్థి పక్షాలు ప్రయత్నిస్తూనే ఉంటాయి. ఇప్పుడు అలాంటి ఘటనే తెలంగాణలోనూ చోటు చేసుకుంది. సోమవారం తెలంగాణ తల్లి నూతన విగ్రహాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత.. అప్పటి వరకు ఉన్న విగ్రహ నమూనాను కాదని.. కొత్త నమూనాను ఆమోదించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తెలంగాణ తల్లి పడుచు రూపంలో తీర్చిదిద్దిన విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా సోమవారం ఆవిష్కరించనున్నారు.
ఇక, ఈ తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అధికార పార్టీ ఏర్పాట్లు చేసింది. మాజీ సీఎం కేసీఆర్ సహా.. కాంగ్రెస్ ముఖ్య నాయకులను, బీజేపీ నాయకులను కేంద్ర మంత్రులను కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి కేసీఆర్ వస్తారా? రారా? అనేది ఇప్పుడు చర్చకు దారితీస్తున్న అంశం. తెలంగాణ ఏర్పడిన తర్వాత. అప్పటి వరకు ఉన్న ‘తెలుగు తల్లి'(దీనిని దివంగత ఎన్టీఆర్ హయాంలో అప్పటి కేబినెట్ ఆమోదం మేరకు.. తీర్చిదిద్దారు) విగ్రహాన్ని కాదని తెలంగాణ తల్లిపేరుతో కొత్త నమూనాను తీసుకువచ్చారు. దీనిని తొలినాళ్లలోనే ఆవిష్కరించారు.
గత పదేళ్లుగా కేసీఆర్.. తెలంగాణ తల్లిగా ఆమెనే భావిస్తున్నారు. ఆ విగ్రహానికే దండలు వేసి దండాలు పెడుతున్నారు. కానీ, ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కారు కేసీఆర్ రూపొందించిన విగ్రహాన్ని కాదని.. మరో రూపాన్ని తీసుకువచ్చింది. కేసీఆర్ రూపొందించిన విగ్రహంలో తలకు కిరీటం వంటివి ఉండడంతో రాజరిక పోకడలు ఉన్నాయన్నది ప్రధాన విమర్శ. మొత్తానికి విగ్రహాన్ని మార్చారు. ఆవిష్కరణకుఏర్పాట్లు కూడా చేశారు. అయితే.. ఈ కార్యక్రమానికి ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా.. కేసీఆర్ వస్తారా? రారా? అనేదే ఇప్పుడు పెద్ద ఎత్తున ఆసక్తిగా మారింది. ఇదే విషయం తెలంగాణ రాజకీయాల్లో జోరుగా చర్చ సాగుతోంది.
ప్రభుత్వ ఆహ్వానాన్ని మన్నించి.. కేసీఆర్ ప్రతిపక్ష నాయకుడిగా విగ్రహ ఆవిష్కరణకు వస్తారని మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించారు. అయితే.. ఇలా కేసీఆర్ కనుక వస్తే.. తాను రూపొందించిన విగ్రహం తప్పని.. తనంతట తానే ఒప్పుకొన్నట్టు అవుతుంది. కాబట్టి వచ్చే అవకాశం నూటికి నూరుపాళ్లు లేదని బీఆర్ ఎస్ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సహా.. మరికొందరు.. కేసీఆర్ ఈ కార్యక్రమానికి రాకపోతే..ఆయన అహంకారం తగ్గలేదని ప్రజలు భావిస్తారని.. చురకలు అంటించారు. సో.. కేసీఆర్ వెళ్తే.. ఒక తంటా.. వెళ్లకపోతే మరో మరో తంటా అనే చర్చ సాగుతుండడం గమనార్హం. మరి ఏం చేస్తారో చూడాలి.