ఏపీలో కూటమి ప్రభుత్వంపై ఆరు మాసాల్లోనే వ్యతిరేకత వచ్చిందన్నది వైసీపీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు జగన్ చెబుతున్న మాట. కానీ, ఆరుమాసాల్లోనే అనేక అభివృద్ది కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామని.. సూపర్ సిక్స్‌లో కొన్ని పథకాలను అమలు చేశామని.. సర్కారు చెబుతున్న మాట. దీంతో అసలు జగన్ చెబుతున్న విషయం ఏ లెక్కల్లో ఉందన్న చర్చ సాగుతోంది. ప్రస్తుతం అయినా.. గతంలో అయినా.. జగన్ సంక్షేమ పథకాలు అందించడమే పాలనగా భావిస్తున్నట్టు తెలుస్తోంది.
తాను అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేసినట్టుగా ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా పథకాల ను వెనువెంటనే అమలు చేయాలని ఆయన కోరుకుంటున్నారు. కానీ, ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో ఇది సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. అయితే.. పథకాలపై ప్రజలు ఏమనుకుంటున్నారన్న విషయంపై మాత్రం సీఎం చంద్రబాబు కూపీ లాగుతున్నారు. ఐవీఆర్ సర్వే ద్వారా ఆయన ప్రజల నాడిని తెలుసు కునే ప్రయత్నంలో ఉన్నారు.
ఈ నేపథ్యంలోనే కొన్ని పథకాలను అమలు చేస్తూ.. మరికొన్నింటిని వాయిదా వేస్తున్నారు. కానీ, జగన్ మాత్రం అన్ని పథకాలూ తొలి ఆరుమాసాల్లోనే అమలు చేయాలన్న వ్యూహంతో ఉన్నట్టు కనిపిస్తోంది. కానీ, ఇది ప్రభుత్వానికి కూడా సాధ్యం కాదు. ఇక, మరో విషయం.. ప్రజల్లో అసంతృప్తి పెరిగిపోయిందన్నది. దీనికి ప్రస్తుతానికైతే.. ఎక్కడా ప్రాతిపదిక కనిపించడం లేదు. ఎందుకంటే.. కీలకమైన పింఛన్లను పెంచడం ద్వారా.. పట్టణ, నగర, గ్రామీణ స్థాయిలో కూటమి సర్కారుకు గ్రాఫ్ పెరిగిందే కానీ, తగ్గలేదు.
ఇక, గ్యాస్ సిలిండిర్ల పంపిణీ పథకం కూడా… కూటమి సర్కారుకు మేలు చేసిందనే చెప్పాలి. అదేసమయంలో అన్న క్యాంటీన్లు, ఉచిత ఇసుక వంటివి ప్రజలకు చేరువయ్యాయి. దీంతో జగన్ చెబుతున్న లెక్కల్లో లాజిక్ కనిపించడం లేదని పరిశీలకులు చెబుతున్నారు. ఇప్పటికిప్పుడు ప్రజలు సూపర్ సిక్స్ అమలు చేయాలని కోరుకుంటున్న పరిస్థితి కూడా కనిపించడం లేదని అంటున్నారు. సో.. ఎలా చూసుకున్నా.. జగన్ చెబుతున్న లెక్కలకు క్షేత్రస్థాయిలో పరిస్థితులకు పొంతన లేదని అంటున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates