చంద్ర‌బాబు భ‌య ప‌డుతున్నారు: ష‌ర్మిల సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ఏపీ సీఎం చంద్ర‌బాబు ల‌క్ష్యంగా కాంగ్రెస్ పీసీసీ చీఫ్ ష‌ర్మిల సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. చంద్ర‌బాబు భ‌య‌పడుతున్నారంటూ.. ఆమె చేసిన కామెంట్లు రాజ‌కీయంగా చ‌ర్చ‌కు దారితీస్తున్నాయి. తాజాగా ఆమె మాట్లాడుతూ.. జ‌గ‌న్ ఐదేళ్ల పాల‌న‌లో జ‌రిగిన అవినీతిపై విచార‌ణ క‌మిటీలు వేశార‌ని, ఇది మంచి ప‌రిణా మ‌మేన‌ని చెప్పారు. ముఖ్యంగా ల్యాండ్ టైటింగ్ యాక్ట్‌ను ర‌ద్దు చేయ‌డం, కాకినాడ పోర్టు కేంద్రంగాజ‌రిగిన రేష‌న్ బియ్యం అక్ర‌మాల‌ను నిగ్గుతేల్చ‌డం వ‌ర‌కు బాగానే ఉంద‌ని పేర్కొన్నారు.

అయితే.. ప్ర‌ముఖ పారిశ్రామిక వేత్త గౌతం అదానీతో సోలార్ ప‌వ‌ర్ కు సంబంధించి జ‌గ‌న్ చేసుకున్న ఒప్పందాలు.. ఈ క్ర‌మంలో తీసుకున్న రూ.1750 కోట్ల లంచాల విష‌యాన్ని ఎందుకు తేల్చడం లేద‌ని ష‌ర్మిల నిగ్గ‌దీశారు. తాము ఏసీబీకి ఫిర్యాదు చేసిన త‌ర్వాత కూడా.. జ‌గ‌న్‌పై ఎందుకు కేసు న‌మోదు చేయ‌డం లేద‌ని ప్ర‌శ్నించారు. అంటే.. జ‌గ‌న్‌పై కేసు పెట్టేందుకు చంద్ర‌బాబు భ‌య‌ప‌డుతున్నారా? అని ష‌ర్మిల నిల‌దీశారు. అంతేకాదు.. గ‌తంలో జ‌గ‌న్‌.. అదానీతో కుమ్మ‌క్కు అయ్యార‌న్న ఆమె.. ఇప్పుడు చంద్ర‌బాబు కూడా అలా చేస్తున్నారా? అని ప్ర‌శ్నించారు.

అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఐ ఇప్ప‌టికే ఇచ్చిన నివేదిక ఆధారంగా కేసులు పెట్టొచ్చుకదా? అని ప్ర‌శ్నించారు. నిజానిజాలు నిగ్గు తేల్చే బాధ్యత చంద్ర‌బాబు లేదా? అని అన్నారు. జ‌గ‌న్‌, అదానీల‌ను అరెస్టు చేస్తేనే వాస్త‌వాలు వెలుగు చూస్తాయ‌న్నారు. లంచంగా పుచ్చుకున్న సొమ్మును రిక‌వ‌రీ చేసి.. దానిని విద్యుత్ న‌ష్టాల కింద తీసుకుని.. ప్ర‌జ‌ల‌పై భారం త‌గ్గించాల‌ని ష‌ర్మిల డిమాండ్ చేశారు. ఇప్పుడు కూడా ఈ విష‌యంలో దాప‌రికాలు జ‌రిగితే.. ప్ర‌జ‌లు మ‌రింత న‌ష్ట‌పోతార‌ని ష‌ర్మిల వ్యాఖ్యానించారు.

జ‌గ‌న్ ప్ర‌భుత్వం పాతికేళ్ల పాటు చేసుకున్న ఒప్పందంతో ఏపీ ప్రజల నెత్తిన లక్ష కోట్ల భారం ప‌డింద‌ని ష‌ర్మిల అన్నారు. విప‌క్షంలో ఉన్న స‌మ‌యంలో టీడీపీ కూడా ఈ ఒప్పందాల‌పై(ప‌య్యావుల కేశ‌వ్‌) హైకోర్టును ఆశ్ర‌యించిన విష‌యాన్ని మ‌రిచిపోయారా? అని అన్నారు. ఈ డీల్ రద్దు చేయాలని హైకోర్టులో కేసు వేసిన విష‌యాన్ని ఒక్క‌సారి గుర్తు చేసుకోవాల‌ని కోరారు. ఇన్ని ఆధారాలు ప‌క్కాగా ఉన్న‌ప్ప‌టికీ..చంద్ర‌బాబు ఎందుకు చ‌ర్య‌లు తీసుకోవ‌డం లేద‌న్నారు.