వైసీపీకి కొన్నాళ్ల కిందట రాజీనామా చేసిన ఏపీ మహిళా కమిషన్ మాజీ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ.. తెలుగు దేశం పార్టీలోకి అరంగేట్రం చేయనున్నట్టు తెలుస్తోంది. తాజాగా ఆమె విజయవాడ ఎంపీ కేశినేని చిన్నితో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. విజయవాడకు వచ్చిన ఆమె.. ఎంపీ చిన్నీ కార్యాలయంలో సుమారు గంట సేపు మంతనాలు జరిపారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఓ సీనియర్ నాయకుడు, ప్రస్తుత ఎమ్మెల్యే సూచనల మేరకు ఆమె టీడీపీలో చేరనున్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఆది నుంచి సీనియర్ నేతతో కలిసి ఆమె అడుగులు వేశారని, ఈ క్రమంలో ఆ నేత సూచనలు పాటిస్తున్నారని సమాచారం.
2004-05 మధ్య రాజకీయ ప్రవేశం చేసిన పద్మ.. తొలినాళ్లలో కాంగ్రెస్‌లో ఉన్నారు. తర్వాత.. ప్రజారాజ్యం పార్టీ పెట్టడంతో చిరంజీవికి జైకొట్టారు. ఆ తర్వాత.. ఆపార్టీ కాంగ్రెస్‌లో విలీనం అయిన తర్వాత.. వైసీపీ ఏర్పాటు చేయడంతో ఆ పార్టీలోకి వచ్చారు. ఇలా.. పుష్కర కాలంగా వైసీపీలో కొనసాగారు. పార్టీ అధికార ప్రతినిధిగా వాసిరెడ్డి వ్యవహరించారు. కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకురాలు కావడం, ఉన్నత విద్యను అభ్యసించిన నేపథ్యంలో వైసీపీలో ఆమెకు బలమైన మద్దతే లభించింది. అయితే.. జగ్గయ్యపేట సీటును ఆశించిన ఆమె 2019లోను, 2024లోను భంగ పడ్డారు.
ఈ ఏడాది జరిగిన ఎన్నికలలో ఖచ్చితంగా టికెట్ తెచ్చుకుని విజయం దక్కించుకుంటానని ఆమె ధీమా వ్యక్తం చేశారు. అయితే.. జగన్ ఆమెకు టికెట్ నిరాకరించారు. ఈ క్రమంలోనే ఆమెను సంతృప్తి పరిచేందుకు మహిళా కమిషన్ చైర్ పర్సన్ పోస్టును ఇచ్చారు. అయినప్పటికీ.. ఆమె ముభావంగానే పనిచేశారు. ఇక, ఆ తర్వాత నుంచి ఆమె చూపు మారిపోయింది. ఇటీవల నెల రోజుల కిందట వైసీపీకి రాజీనామా చేశారు. దీనికి ముందే… ఈ ఏడాది ఎన్నికలకు రెండు వారాల ముందు.. మహిళా కమిషన్ చైర్ పర్సన్ పోస్టుకు కూడా రాజీనామా సమర్పించారు. అనంతరం.. మాజీ సీఎం జగన్ కేంద్రంగా తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
ఇక, ఇప్పుడు టీడీపీలో చేరేందుకు రెడీ అయ్యారన్నది రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ. టీడీపీలోకి వచ్చాక.. ఆమె తిరిగి మహిళా చైర్ పర్సన్ పోస్టును పొందే అవకాశం ఉందని సమాచారం. దీనికి సంబంధించి టీడీపీ నాయకులు బహిరంగ ప్రకటన చేయకపోయినా.. నారా లోకేష్ సమక్షంలో వాసిరెడ్డి పద్మ టీడీపీలో చేరనున్నారని మాత్రం కన్ఫర్మ్ అయిందని సమాచారం. దీనికి అధినేత చంద్రబాబు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలిసింది.