డిప్యూటీ స్పీక‌ర్ ర‌ఘురామ‌కు.. మ‌రో గౌర‌వం!

ఏపీ డిప్యూటీ స్పీక‌ర్‌గా ఉన్న కనుమూరి ర‌ఘురామ‌కృష్ణ‌రాజుకు తాజాగా మ‌రో గౌర‌వం ద‌క్కింది. ప్ర‌స్తుతం ఉప స‌భాప‌తిగా ఉన్న ర‌ఘురామ‌కు కేబినెట్ హోదా క‌ల్పిస్తూ.. రాష్ట్ర ప్ర‌భుత్వం తాజాగా నిర్ణ‌యించింది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ లెజిస్లేచ‌ర్ చ‌ట్టంలోని ఆర్టికల్ 15 మేర‌కు ఆయ‌న‌కు కేబినెట్ హోదాను ఇస్తున్న‌ట్టు పేర్కొం ది. ర‌ఘురామ‌కృష్ణ‌రాజు డిప్యూటీ స్పీక‌ర్ గా ఆ ప‌ద‌విలో ఉన్నంత కాలం.. ఈ హోదా ఆయ‌న‌కు వ‌ర్తిస్తుం ద‌ని తెలిపింది.

కేబినెట్ హోదా ర‌ఘురామ‌కు.. వ్య‌క్తిగ‌తంగా వ‌ర్తిస్తుంద‌ని తాజాగా విడుద‌ల చేసిన జీవోలో పేర్కొన్నారు. ఈ మేర‌కు ప్ర‌భుత్వ రాజ‌కీయ కార్య‌ద‌ర్శి సురేష్‌కుమార్ ఉత్త‌ర్వులు జారీ చేశారు. ఇక‌, నుంచి ఆయ‌న‌కు కేబి నెట్ ర్యాంకుకు అనుగుణంగా ప్రొటోకాల్‌, భ‌ద్ర‌తా ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఉత్త‌ర్వుల్లో సూచించారు. దీంతో ర‌ఘురామ‌కు కూట‌మి ప్ర‌భుత్వం మ‌రో అమూల్య‌మైన గౌరవాన్ని ఇచ్చిన‌ట్టు అయింది.

ఇదే ఫ‌స్ట్ టైమ్‌..

ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ స‌హా.. విభ‌జ‌న త‌ర్వాత ఉప స‌భాప‌తులుగా చేసిన వారు కొంద‌రు ఉన్నారు. అయితే.. ఎవ‌రికీ ఈ విధంగా కేబినెట్ హోదా క‌ల్పిస్తూ గతంలో ఎలాంటి నిర్ణ‌యాలు తీసుకోలేదు. తాజాగా.. తీసుకున్న ఈ నిర్ణ‌యం తొలిసారి కావ‌డం గ‌మ‌నార్హం. ఈ ఏడాది జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ప‌శ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజ‌క‌వ‌ర్గం నుంచి విజ‌యం ద‌క్కించుకున్న ర‌ఘురామ మంత్రిప‌ద‌విని ఆశించారు. త‌ర్వాత‌.. స్పీక‌ర్ ప‌ద‌విని కూడా ఆశించారు. ఈ రెండు కూడా కేబినెట్ ర్యాంకుతో కూడుకున్న‌వే.

అయితే.. ర‌ఘురామ కోరుకున్న‌ట్టుగా ఈ ప‌ద‌వులు ఆయ‌న‌కు ద‌క్క‌లేదు. ఈ క్ర‌మంలో సీఎం చంద్ర‌బాబు ఆయ‌న‌కు డిప్యూటీ స్పీక‌ర్ ప‌ద‌విని అప్ప‌గించారు. అయితే.. ఇది కేబినెట్ హోదాతో కూడి లేదు. అయినా.. ర‌ఘురామ ఎక్క‌డా అసంతృప్తికి లోను కాకుండా.. త‌న ప‌నితాను చేసుకుపోతున్నారు. అయితే.. చంద్ర‌బాబు మ‌రింత గౌర‌వం ఇవ్వాల‌ని భావించి ఇప్పుడు ర‌ఘురామ‌కు కేబినెట్ హోదా ఇవ్వ‌డం గ‌మ‌నార్హం.