గ‌గ్గోలు పెట్టిన సాయిరెడ్డి!

వైసీపీ కీల‌క నాయ‌కుడు, రాజ్యస‌భ స‌భ్యుడు వి. విజ‌యసాయిరెడ్డి గ‌గ్గోలు పెట్టారు. కాకినాడ పోర్టు విష‌యంలో కోనేరు వెంక‌టే శ్వ‌ర‌రావు(కేవీ రావు)ను బెదిరించార‌న్న కేసులో సాయిరెడ్డిపై ఏపీ సీఐడీ అధికారులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.

దీనిపై తాజాగా స్పందించిన సాయిరెడ్డి గ‌గ్గోలు పెట్టారు. తానేమైనా దొంగ‌నా? దేశం విడిచిపారిపోతానా? అని ప్ర‌శ్నించారు. తాను బాధ్య‌తాయుత‌మైన రాజ్య‌స‌భ స‌భ్యుడిన‌ని.. అనేక అంశాల‌పై స‌భ‌లో ప్ర‌జ‌ల త‌ర‌ఫున మాట్లాడుతున్నాన‌ని కూడా.. చెప్పుకొచ్చారు. అలాంటి త‌న‌ పై లుక్ అవుట్ నోటీసులు జారీ చేయ‌డం ఏంట‌ని ప్ర‌శ్నించారు.

త‌న‌కు నోటీసులు జారీచేయ‌డంతో త‌న ప‌రువు పోయింద‌న్న సాయిరెడ్డి సీఎం చంద్ర‌బాబు స‌హా వ్యాపార వేత్త కేవీరావుపై ప‌రువు న‌ష్టం దావా వేస్తాన‌ని చెప్పారు. ఇదే స‌మ‌యంలో కాకినాడ పోర్టు విష‌యంలో వ‌చ్చిన ఆరోప‌ణ‌ల‌పై సాయిరెడ్డి స్పందించారు. ఈ పోర్టులో వాటా కోసం.. అర‌బిందో (సాయిరెడ్డి అల్లుడి త‌ర‌ఫు సంస్థ‌) త‌ర‌ఫున వైసీపీ రాజ్య‌స‌భ స‌భ్యుడు.. వైవీ సుబ్బారెడ్డి త‌న‌యుడు విక్రాంత్ రెడ్డి మ‌ధ్య‌వ‌ర్తిగా వ్య‌వ‌హ‌రించార‌ని.. వార్త‌లు వ‌చ్చాయి. ఈ విష‌యాన్ని కేవీరావే.. ఏపీసీఐడీకి ఫిర్యాదు చేశారు. దీంతో విక్రాంత్ రెడ్డిపై బెదిరింపులు.. భ‌యపెట్టారు.. అనే కోణంలో ప‌లు సెక్ష‌న్ల కింద కేసులు న‌మోదు చేశారు.

ఈ విష‌యాన్ని ప్ర‌స్తావిస్తూ.. “విక్రాంత్ అమాయ‌కుడు. చిన్న పిల్ల‌వాడు. కేవీ రావు అనే వ్య‌క్తి అంత‌ర్జాతీయ బ్రోక‌ర్‌“ అని సాయిరెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. విదేశాల్లో కూర్చుని లాబీయింగులు చేసుకునే కేవీ రావు.. బ‌డా పారిశ్రామిక‌వేత్త అని.. ప్ర‌భుత్వాల‌ను కూడా ప్ర‌భావితం చేయ‌గ‌ల‌రని చెప్పుకొచ్చారు. అలాంటి వ్య‌క్తిని చిన్న పిల్లోడైన విక్రాంత్ రెడ్డి ఎలా ప్ర‌భావితం చేస్తాడ‌ని.. భ‌య‌పెడ‌తాడ‌ని సాయిరెడ్డి ప్ర‌శ్నించారు. కేవీ రావు.. ఏడాదిలో సగం రోజులు అమెరికాలోనే ఉంటున్నాడ‌ని చెప్పారు. సింగ‌పూర్‌లో కేంద్ర‌కార్యాల‌యం ఉంద‌ని.. అక్క‌డ నుంచే బ్రోక‌ర్ ప‌నులు చేస్తున్నాడ‌ని ఆరోపించారు.

1997 నుంచి విచార‌ణ‌..

కాకినాడ సీ పోర్టు విష‌యంలో విచార‌ణ చేయాల్సి వ‌స్తే.. 1997 నుంచి విచార‌ణ జ‌రిపించాల‌ని.. దీనిని సీబీఐకి ఇవ్వాల‌ని సాయిరెడ్డి డిమాండ్ చేశారు. అప్ప‌ట్లో సీఎంగా ఉన్న చంద్ర‌బాబు.. ఈ పోర్టును ఏషియన్ డెవలప్ మెంట్ బ్యాంకు (ఏడీబీ) నిధులతో ఏర్పాటు చేశార‌న్న ఆయ‌న‌.. దీనిని ప్రైవేటుకు ఇచ్చిందే అప్ప‌టి సీఎం చంద్ర‌బాబు అని విమ‌ర్శించారు. కాకినాడ సీ పోర్టును త‌న‌కు మిత్రుడైన కేవీ రావుకు అప్పగించార‌ని, సీఎండీని చేశార‌ని ఆరోపించారు. కాబ‌ట్టి అప్ప‌టి నుంచి విచార‌ణ జ‌రిపితేనే వాస్త‌వాలు తెలుస్తాయ‌న్నారు. నిజంగానే కేవీరావుకు అన్యాయం జ‌రిగి ఉంటే.. ఇన్నేళ్లు ఎందుకు వెయిట్ చేశార‌ని సాయిరెడ్డి ప్ర‌శ్నించారు.