ప్రముఖ పారిశ్రామిక వేత్త అదానీ నుంచి రూ.1750 కోట్ల మేరకు లంచాలు తీసుకున్నారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ సీఎం జగన్‌పై ఆయన సోదరి పీసీసీ చీఫ్ షర్మిల నిరసన బాట పట్టారు. బుధవారం ఆమె ప్రకటించినట్టుగానే గురువారం ఉదయం.. జగన్‌పై ఏపీ ఏసీబీకి ఫిర్యాదు చేసేందుకు వచ్చారు. అయితే.. దీనికి ముందే.. ఆమె మీడియాతో మాట్లాడుతూ.. అదానీ – జగన్ రూ.1750 కోట్ల ముడుపుల పై వెంటనే దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు.
ఆనాడు అదానీ డీల్ పై కోర్టును ఆశ్రయించిన టీడీపీ ఇప్పుడెందుకు మౌనం పాటిస్తోందని షర్మిల ప్రశ్నించారు. అదానీపై అమెరికాలో దర్యాప్తు జరుగుతుందని, సోలార్ పవర్ డీల్ లో జగన్ కి 1750 కోట్లు ముడుపులు ఇచ్చారని వెల్లడి అయ్యిందని తెలిపారు. అమెరికా దర్యాప్తు సంస్థలు ఆధారాలు కూడా బయట పెట్టాయన్నారు. విదేశాల్లోనే ఇంత జరుగుతుంటే మన దర్యాప్తు సంస్థలు నిద్ర పోతున్నాయా? అని షర్మిల వ్యాఖ్యానించారు. ఇంత అవినీతి జరిగితే మన రాష్ట్రంలో దర్యాప్తు సంస్థలు ఎందుకు బయటపెట్టలేదన్నారు.
జగన్ అదానీ లంచాల కారణంగా.. ప్రస్తుతం రాష్ట్ర ప్రజలపై విద్యుత్ చార్జీల రూపంలో రూ.లక్ష కోట్ల ఆర్థిక భారం పడిందని షర్మిల ఆరోపించారు. అదానీతో 25 ఏళ్ల ఒప్పందం అంటే రాష్ట్రం నెత్తిన ఆర్థిక భారం పడుతుందన్నారు. ఒకప్పుడు సోలార్ పవర్ యూనిట్ కి 10 రూపాయలు ఉండేదని, ఇప్పుడు యూనిట్ ధర 1.99 పైసలకు తగ్గిందన్నారు. వచ్చే రోజుల్లో సోలార్ యూనిట్ ధర రూ.050 పైసలకే వచ్చినా రావొచ్చని తెలిపారు. అలాంటి పవర్ కోసం 25 ఏళ్లకు అగ్రిమెంట్ ఎలా చేశారని జగన్‌ను నిలదీశారు.
యూనిట్ రూ.2.49 పైసలకు కొని రాష్ట్రం నెత్తిన లక్ష కోట్ల భారం ఎందుకు మోపారని ప్రశ్నించారు. రాహుల్ గాంధీ సైతం అదాని అరాచకాలపైనా అవినీతి అక్రమాలపైనా పార్లమెంటులో పోరాటం చేస్తున్నట్టు చెప్పారు. అదానీ వ్యవహారంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలని డిమాండ్ చేస్తున్నారని, తాము రాష్ట్రంలో ఆందోళనలు చేస్తున్నట్టు షర్మిల చెప్పుకొచ్చారు. ఈ కేసులో జగన్ జైలుకు వెళ్లడం ఖాయమని షర్మిల వ్యాఖ్యానించారు.