ఇండియా కూటమి దెబ్బతినేలా కేజ్రీవాల్ నిర్ణయం?

దేశ రాజధాని ఢిల్లీలో వచ్చే ఏడాది జరగబోయే అసెంబ్లీ ఎన్నికలు ఆసక్తికరంగా మారనున్నాయి. అధికార ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత అరవింద్ కేజ్రీవాల్ తన పార్టీ స్టాండ్‌ను స్పష్టంగా తెలియజేశారు. ఇండియా కూటమితో కలిసి పోటీ చేయడం అనే ఆలోచననే తమ పార్టీకి లేదని, అన్ని నియోజకవర్గాల్లో తమ అభ్యర్థులే బరిలో ఉంటారని కేజ్రీవాల్ స్పష్టం చేశారు. రాజకీయంగా ఈ ప్రకటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

ఆదివారం మీడియాతో మాట్లాడిన కేజ్రీవాల్, ఢిల్లీ శాంతిభద్రతల పరిస్థితిపై తనపై జరిగిన దాడిని ప్రస్తావిస్తూ కేంద్ర హోంమంత్రి అమిత్ షాను ప్రశ్నించారు. “నేను ప్రజల సమస్యలను లేవనెత్తడం తప్పా? గ్యాంగ్ స్టర్లను అరెస్టు చేయించడంలో విఫలమైన మీ ప్రభుత్వం మా మీదే దృష్టి పెట్టింది. నాపై దాడి జరగడం ప్రజాస్వామ్యానికి మచ్చ” అని ఆయన విమర్శించారు. ఇండియా కూటమి భాగస్వామిగా ఉన్నప్పటికీ, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరితోనూ పొత్తు పెట్టుకోమని, తమ పార్టీ స్వతంత్రంగా పోటీ చేయనున్నట్లు కేజ్రీవాల్ చెప్పిన మాటలు రాజకీయ వర్గాల్లో కలకలం రేపాయి.

గతంలో పంజాబ్ లోక్‌సభ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్‌తో కలిసి పనిచేయడానికి ఆప్ నిరాకరించింది. ఇప్పుడు అదే విధానాన్ని ఢిల్లీలో కొనసాగించబోతుందని తెలుస్తోంది. ఇక ఢిల్లీ కాంగ్రెస్ ఇప్పటికే తమ అభ్యర్థులతోనే బరిలోకి దిగుతామని స్పష్టం చేయడంతో, అటు కాంగ్రెస్ – ఆప్ మధ్య రాజకీయ అసమతుల్యత మరింత స్పష్టమైంది. ఇది భారతీయ జాతీయ కాంగ్రెస్‌కు పెద్ద ఎదురుదెబ్బగా భావించబడుతోంది.

కాంగ్రెస్, ఆప్ కలిసి పోటీ చేస్తే బీజేపీని ఎదుర్కోవడంలో బలంగా ఉంటారని భావించిన వర్గాలకు ఈ ప్రకటన షాకింగ్‌గా మారింది. ఢిల్లీలో ఆప్ ఒంటరిగా పోటీ చేయడం, కాంగ్రెస్ కూడా అదే విధానాన్ని అనుసరించడం బీజేపీకి లాభసాటిగా మారుతుందా లేదా అనే దానిపై రాజకీయ విశ్లేషకులు విభిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మళ్లీ ఢిల్లీపై తన పట్టు చాటేందుకు కేజ్రీవాల్ తీసుకున్న ఈ వ్యూహం ఏ మేరకు విజయవంతం అవుతుందో వేచిచూడాల్సిందే.