ఏపీ ఐటీ శాఖా మంత్రి నారా లోకేశ్ తో ‘మా’ అధ్యక్షుడు, టాలీవుడ్ హీరో మంచు విష్ణు భేటీ అయ్యారు. సోదరుడు, డైనమిక్ మినిస్టర్ లోకేశ్ ను మర్యాదపూర్వకంగా కలిశానని, ఇద్దరం పలు అంశాలపై చర్చించుకున్నామని విష్ణు చెప్పారు. ఇద్దరి మధ్య చర్చ ఫలప్రదంగా జరిగిందని అన్నారు. లోకేశ్ సానుకూల దృక్పథం కలిగిన వ్యక్తి అని విష్ణు కొనియాడారు. లోకేశ్ కు భగవంతుడు మరింత శక్తినివ్వాలని కోరుకుంటున్నానని విష్ణు ట్వీట్ చేశారు.
‘మా’ అధ్యక్షుడి హోదాలో ఏపీలో సినీ పరిశ్రమ విస్తరణ, షూటింగులు, ఫిల్మ్ టూరిజం వంటి విషయాలపై లోకేశ్‌తో విష్ణు చర్చించారని తెలుస్తోంది. ఇండస్ట్రీని ప్రోత్సహించేందుకు ఏపీ ప్రభుత్వం చేపట్టిన చర్యల గురించి విష్ణు, లోకేశ్ చర్చించారట. అయితే, సినీ పరిశ్రమకు సంబంధించిన విషయాలతోపాటు వారి మధ్య రాజకీయపరమైన అంశాలు కూడా చర్చకు వచ్చి ఉంటాయని టాక్ వస్తోంది.
ఇండస్ట్రీ తరఫున లోకేశ్ తో భేటీ అయితే ఇండస్ట్రీకి చెందిన మరికొందరు పెద్దలు కూడా వచ్చి ఉండేవారని, ఇది రాజకీయ భేటీ కాబట్టి విష్ణు సోలోగా కలిశారని ఇండస్ట్రీలోని కొందరు అంటున్నారు. వైసీపీతో మంచు ఫ్యామిలీకి గ్యాప్ వచ్చిన నేపథ్యంలో టీడీపీకి దగ్గర కావాలన్న ప్రయత్నంలో భాగంగానే లోకేశ్ తో విష్ణు భేటీ అయ్యారని మరో ప్రచారం జరుగుతోంది.
గత ఎన్నికలకు ముందు మంచు కుటుంబం వైసీపీకి అనుకూలంగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. పార్టీలో చేరకపోయినా మోహన్ బాబు అనేక అంశాల్లో జగన్ కు అనుకూలంగా వ్యవహరించారు. అయితే, రాజ్యసభ సీటు ఆశించిన మోహన్ బాబు భంగపాటుకు గురికావడంతో ఆయన పార్టీకి దూరం జరిగారని ప్రచారం జరిగింది. ఆ క్రమంలోనే ఎన్నికలకు ముందే వైసీపీకి మంచు కుటుంబం దూరమైంది. ఈ క్రమంలోనే లోకేశ్‌ను మంచు విష్ణు కలవడం చర్చనీయాంశమైంది.