కలియుగ ప్రత్యక్ష దైవరం తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులు, వ్యాపారవేత్తలు కుటుంబసమేతంగా వెళుతుంటారు. ప్రశాంతంగా శ్రీవారిని దర్శించుకొని సాంత్వన పొందేందుకు అక్కడకు వెళతారు. ఈ క్రమంలోనే వారితో మీడియా ప్రతినిధులు మాట్లాడే క్రమంలో కొందరు రాజకీయాల గురించి మాట్లాడుతున్నారు. ఈ క్రమంలోనే తిరుమల కొండపై ఇకపై రాజకీయాల గురించి మాట్లాడకూడదని కొద్ది రోజుల క్రితం సమావేశమైన టీటీడీ పాలక మండలి తీర్మానించింది.
ఈ క్రమంలోనే నేటి నుంచి ఆ నిబంధన అమల్లోకి రానుందని టీటీడీ తెలిపింది. తిరుమల కొండపై రాజకీయ విమర్శలు చేయడం పరిపాటిగా మారిన నేపథ్యంలో టీటీడీ ఈ తరహా కీలక నిర్ణయం తీసుకుంది.
మీడియాతో మాట్లాడే సందర్భాల్లో ఆధ్యాత్మికతకు సంబంధించిన విషయాల కంటే రాజకీయ విమర్శలు, వ్యక్తిగత వ్యాఖ్యానాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు.తిరుమలో రాజకీయ ప్రసంగాలపై నిషేధం విధించడంపై పలువురు భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
కొందరు రాజకీయ నాయకులు తిరుమల కొండ అని కూడా చూడకుండా రాజకీయ, ద్వేషపూరిత ప్రసంగాలు చేయడంపై విమర్శలు వచ్చాయి. దీంతో, ఈ నిబంధనను టీటీడీ ఈ రోజు నుంచి అమల్లోకి తెచ్చింది. తమ నిబంధనలను ఉల్లంఘించి రాజకీయ విమర్శలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని టీటీడీ స్పష్టం చేసింది. తిరుమలలో శ్రీవారి ఆలయ పవిత్రత, ఆధ్యాత్మికమైన ప్రశాంత వాతావరణాన్ని కాపాడేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. ఈ నిబంధనను భక్తులు, రాజకీయ నాయకులు అందరూ పాటించి తిరుమల పవిత్రతను కాపాడాలని కోరారు. తిరుమలలో నేటి నుంచి రాజకీయ వ్యాఖ్యలను నిషేధిస్తున్నామని సీపీఆర్వో టీటీడీ ఉత్తర్వులు జారీ చేశారు.