టీడీపీ ఎమ్మెల్యేకు పవన్ క్లాస్

జగన్ హయాంలో వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అక్రమ బియ్యం ఎగుమతి చేస్తున్నారంటూ తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. ఆ క్రమంలోనే ద్వారంపూడిపై గతంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ విమర్శలు గుప్పించారు. అయితే, ఎన్డీఏ ప్రభుత్వం ఏపీలో అధికారంలో ఉన్నప్పటికీ కాకినాడ పోర్టు కేంద్రంగా అక్రమ బియ్యం రవాణా యథేచ్ఛగా సాగుతోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ వ్యవహారంపై పవన్ కల్యాణ్ స్పందించారు.

ఇలాంటి ఘటనలను పట్టించుకోవాలంటటూ స్థానిక ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు, పోర్టు అధికారులపై పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో అక్రమ రేషన్ బియ్యంపై పోరాటం చేశామని, అటువంటిది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా పరిస్థితి మారకుంటే ఎలా అని పవన్ అసహనం వ్యక్తం చేశారు. కొద్ది రోజుల క్రితం 640 టన్నుల బియ్యాన్ని కాకినాడ కలెక్టర్ సీజ్ చేసిన ప్రాంతానికి నౌకలో వెళ్లి పరిశీలించిన సందర్భంగా పవన్ ఈ వ్యాఖ్యలు చేశారు.

ఈ పోర్టు నుంచి గత ప్రభుత్వ పాలనలో మొదలైన అక్రమ రవాణా ఇప్పటికే కొనసాగుతోందని, జవాబుదారీతనం లేదని పవన్ ఫైర్ అయ్యారు. పోర్ట్ ఆఫీసర్ ధర్మ శాస్త్రి, డీఎస్పీ రఘు వీర్, సివిల్ సప్లై డీ ఎస్ ఓ ప్రసాద్ పై పవన్ సీరియస్ అయ్యారు. అక్రమ రేషన్ వంటి వ్యవహారాలపై ప్రభుత్వం సీరియస్ గా ఉందని, కానీ, క్షేత్ర స్థాయిలో పరిస్థితులు ప్రభుత్వం చెబుతున్నట్లు లేవని అసహనం వ్యక్తం చేశారు. పోర్ట్‌ కు ఇన్ని టన్నుల అక్రమ రేషన్ బియ్యం వస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.

స్వయంగా మంత్రి వచ్చి చెప్పినా సీరియస్ నెస్ లేదని, నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తప్పవని పవన్ వార్నింగ్ ఇచ్చారు. పోర్టులో ఎవరూ బాధ్యతాయుతంగా వ్యవహరించడం లేదని పవన్ కళ్యాణ్ మండిపడ్డారు.