పెద్ద‌ల స‌భ‌కు పెరుగుతున్న పోటీ.. బాబు క‌రుణ ఎవ‌రిపై..!

రాజ్య‌స‌భకు సంబంధించి ఏపీలో మూడు స్థానాలు ఖాళీ అయ్యాయి. వీటిలో రెండు టీడీపీ తీసుకుని.. ఒక‌టి మాత్రం కూట‌మి పార్టీల‌కు అప్ప‌గించాల‌ని ప్ర‌య‌త్నిస్తున్నారు. దీనికి సంబంధించి సీఎం చంద్ర‌బాబు నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు కూడా తెలుస్తోంది. దీంతో రెండు స్థానాలు గుండుగుత్త‌గా టీడీపీకి ద‌క్క‌నున్నాయి. అయితే..ఈ రెండు స్థానాల విష‌యంలో టీడీపీలో పోటీ హాట్‌హాట్‌గా సాగుతోంది. నేనంటే నేనే అంటూ.. నాయ‌కులు పోటీ ప‌డుతున్నారు.

అంతేకాదు.. సీఎం చంద్ర‌బాబు వ‌ద్ద‌కు క్యూ క‌డుతున్నారు. అయితే.. వీరిలో ఎవ‌రికి ఇవ్వాల‌నే విష‌యం పై చంద్ర‌బాబు గోప్యత పాటిస్తున్నారు. ప్ర‌స్తుతం ఉన్న అంచ‌నాల‌ప్ర‌కారం రెండు స్థానాల కోసం ఆరుగురు బ‌రిలో ఉన్నారు. వీరిలో ఎవ‌రికి ఇవ్వాల‌నే విష‌యంపై త‌ర్జ‌న భ‌ర్జ‌న సాగుతోంది. అయితే.. ఇంత‌లోనే మ‌రో ఇద్ద‌రు నాయ‌కులు చంద్ర‌బాబును క‌లిసి త‌మ‌కు ఇవ్వాల‌ని చంద్ర‌బాబుకు విన్న‌వించారు. ఈ ఏడాది ఎన్నిక‌ల్లో గుంటూరు పార్ల‌మెంటు సీటును ఆశించి భంగ‌ప‌డిన భాష్య రామ‌కృష్ణ ఒక‌రు.

ఈయ‌న గుంటూరు పార్ల‌మెంటు స్థానంపై చాలానే ఆశ‌లు పెట్టుకున్నారు.కానీ, వైసీపీని మ‌రింత బ‌లంగా ఎదుర్కొనే క్ర‌మంలో చంద్ర‌బాబు ఈ సీటును పెమ్మ‌సాని చంద్ర‌శేఖ‌ర్‌కు ఇచ్చారు. దీంతో ఇప్పుడు భాష్యం.. రాజ్య‌స‌భ సీటు కోసం ఎదురు చూస్తున్నారు. పార్టీ కోసం తాను చేసిన కృషిని వివ‌రిస్తూ.. 130 పేజీల‌తో కూడిన పెద్ద నివేదిక‌ను కూడా ఆయ‌న తాజాగా చంద్ర‌బాబు కు అందించారు. మ‌రోవైపు.. పార్టీ సీనియ‌ర్ నేత‌, మాజీ ఎమ్మెల్సీ టీడీ జ‌నార్ద‌న్ కూడా ఈ బ‌రిలో ఉన్నారు.

త‌న‌ను కూడా ప‌ట్టించుకోవాల‌ని ఆయ‌న తాజాగా ఆయ‌న చంద్ర‌బాబుకు ఫ్యాక్సు మెసేజ్ పంపించారు. తాను పార్టీలో పాతికేళ్ల‌కు పైగానే ఉన్నాన‌ని.. త‌న‌కు అవ‌కాశం ఇవ్వాల‌ని ఇదే లాస్ట్ ఛాన్స్ అని ఆయ‌న కోరుతున్నారు. ఇక‌, పైకి క‌నిపించ‌క‌పోయినా.. తెర‌వెనుక‌.. మాత్రం ఆరుగురు ప్ర‌య‌త్నిస్తున్నారు. వీరిలో మాజీ ఎంపీ గ‌ల్లా జ‌య‌దేవ్‌, సినీ న‌టుడు మాజీ ఎంపీ ముర‌ళీ మోహ‌న్‌, అదేవిధంగా రాజ‌కీయాల‌కు దూరంగా ఉన్నాన‌ని చెబుతున్న న‌టుడు మోహ‌న్‌బాబు, నిర్మాత అశ్వినీ ద‌త్ స‌హా.. కేంద్ర మాజీ మంత్రి అశోక్ గ‌జ‌ప‌తి రాజు కూడా ఈజాబితాలో ఉన్నారు. దీంతో ఎవ‌రికి అవ‌కాశం చిక్కుతుందో చూడాలి.