టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఉచిత ఇసుక పథకానికి గ్రహణం వీడడం లేదు. ఎన్నోసార్లు ఈ విషయంలో జోక్యం చేసుకోవద్దని తమ్ముళ్లకు చంద్రబాబు చెబుతూనే ఉన్నారు. అయినా.. ఎక్కడా అధినేత మాటను వంటబట్టించుకున్న నాయకులు కనిపించడం లేదు. దాదాపు నాలుగు నెలలుగా ఇదే తంతు నడుస్తోంది. చంద్రబాబు చెబుతున్నా.. నాయకులు వినిపించుకోవడం లేదు.
తాజాగా మరోసారి చంద్రబాబు హెచ్చరించే పరిస్థితి వచ్చింది. ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన కాంట్రాక్టర్లు తాజాగా ఇసుక విషయంపై చంద్రబాబును కలుసుకున్నారు. చిత్రం ఏంటంటే వీరంతా కూడా.. టీడీపీ సానుకూల కాంట్రాక్టర్లు. అయినప్పటికీ.. వీరికిసైతం ఇసుక లభించడం లేదన్నది వారు చెబుతున్న మాట. ప్రతి లారీకీ ఇంతని వసూలు చేస్తున్నారని పేర్కొంటూ.. నలుగురు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీల పేర్లతో జాబితానే ఇచ్చారు.
ఇదేసమయంలో ఎయే లారీలకు ఎప్పుడెప్పుడు ఎంతెంత వసూలు చేసింది కూడా ఆధారాలతో చంద్ర బాబు ముందు పెట్టారని తెలిసింది. ఈ వివరాలు చూసిన అధినేత నివ్వెరపోయారు. పరిస్థితిలో మార్పు రావడం లేదని.. ఇలా అయితే కష్టేనని చంద్రబాబు భావిస్తున్నారు. కాంట్రాక్టర్ల పరిస్థితి, అందునా టీడీపీ అనుకూల కాంట్రాక్టర్ల పరిస్థితే ఇలా ఉంటే.. సామాన్యుల పరిస్థితి ఏంటని అధికారులను నిలదీశారు. ఇసుక విషయంలో మాట రావడానికి వీల్లేదని చెప్పారు.
ఈ నేపథ్యంలో వచ్చే సోమవారం నుంచి తానే స్వయంగా ఇసుకపై పరిశీలన చేస్తానని కూడా చంద్రబా బు తేల్చిచెప్పారు. ప్రతి విషయాన్ని తనకు చెప్పాలని.. ఎవరు ఎక్కడ దందాలకు పాల్పడినా ఊరుకునేది లేదన్నారు. అయితే.. చిత్రం ఏంటంటే.. ఆరోపణలు ఎదుర్కొంటున్న నాయకులు సీనియర్లు కావడం.. వారికి పార్టీతో ఎనలేని అనుబంధం ఉండడంతో చంద్రబాబు వారిని నేరుగా హెచ్చరించలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో ఆయన తలపట్టుకుంటున్నారు.